
అక్టోబర్ 2 నాటికి దేశంలో గ్రామీణ బ్యాంకులు అర్ధశతాబ్ది పూర్తిచేసుకుంటున్నాయి. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్మా గాంధీ జయంతి రోజున మన దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ఈ గ్రామీణ పరపతి వ్యవస్థ అక్టోబర్ 2న 1975లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ప్రథమ గ్రామీణ బ్యాంకుగా ఆరంభమైనది. గ్రామీణులకు వ్యవసాయం, వివిధ చేతివృత్తులకు పెట్టుబడులు, తదితర ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఏర్పరచిన ఈ బ్యాంకులు ప్రస్తుతం 50 ఏండ్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఈ అర్ధ శతాబ్దికాలంలో గ్రామీణ బ్యాంకులు దేశవ్యాప్తంగా విస్తరిస్తూ పల్లెవాసులకు ఎన్నో విధాలుగా తమ సేవలను అందిస్తున్నాయి. వీటి రాకకు ముందు డబ్బులు దాచిపెట్టుకోవడానికి, అప్పు ఇవ్వడానికి దేశంలో ఓఆర్థిక వ్యవస్థ ఉందన్న విషయం కూడా పల్లెవాసులకు తెలిసి ఉండదు.
ఎమర్జెన్సీ కాలంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకంలో భాగమైన గ్రామీణాభివృద్ధి అనేది వీటి ఆవిర్భావానికి మూలమైంది. వాణిజ్య బ్యాంకులు గ్రామాల్లో తమ శాఖలు ఏర్పాటుచేస్తే వ్యాపారపరంగా నష్టపోతాయి. వాటి సరళిలోనే గ్రామాలకు పరపతి సౌకర్యం అందాలి అనే ఉద్దేశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహం నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. గ్రామీణుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు తక్కువ ఖర్చుతో, తక్షణ లాభాపేక్ష లేకుండా వాణిజ్య బ్యాంకుల మినీరూపంలో వీటిని ఏర్పాటు చేయొచ్చని ఆ కమిటీ తెలిపింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 50 %, స్పాన్సర్ బ్యాంకు 35 %, రాష్ట్ర ప్రభుత్వం 15 % భాగస్వామ్యం కలిగి ఉండాలని, గ్రామీణుల సౌలభ్యం కోసం బ్రాంచిల్లో పనిచేసేందుకు స్థానికులను నియమించుకొని, నిర్వహణ బాధ్యత స్పాన్సర్ బ్యాంకుగా వ్యవహరించే వాణిజ్య బ్యాంకు చేపట్టాలని కమిటీ సూచించింది. వీటి విధి విధానాల రూపకల్పన, అజమాయిషీ అంతా నాబార్డ్ చేతిలో ఉంటుందని ఆ చట్టంలో ఉంది.
నికర లాభం రూ.7,571 కోట్లు
ప్రభుత్వ సంస్థలన్నీ స్వయం సమృద్ధి సాధించాలనే, నష్టాల్లో ఉన్నవాటిని లాభాల్లోకి తేవాలనే ఉద్దేశ్యంతో గ్రామీణ బ్యాంకుల శాఖలు పట్టణాల్లో, నగరాల్లో ఆరంభమయ్యాయి. వాటి ద్వారా నగరవాసులకు అవసరమయ్యే గృహ, వాహన రుణాలు, నగల తాకట్టుతో రుణాలు, పెద్ద వ్యాపారాలకు పెట్టుబడులు అందిస్తూ అవి లాభాల బాట పట్టాయి.
వటవృక్షానికి వేర్ల మాదిరి ఉన్న నగర, పట్టణ శాఖలు పొదుపు మొత్తాలను, లాభాలను అందుకొని పచ్చని కొమ్మల్లాంటి గ్రామీణ శాఖలను కాపాడుతున్నాయి. 2023– -24లో దేశంలోని గ్రామీణ బ్యాంకులు సంయుక్తంగా సాధించిన నికర లాభం రూ. 7,571 కోట్లు అంటే వీటి విజయాన్ని అంచనా వేయవచ్చు.
కంప్యూటరీకరణ తర్వాత నిర్వహణా భారాన్ని తగ్గించేందుకు బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అదే బాటలో గ్రామీణ బ్యాంకుల కుదింపు మొదలైంది. 2006లో స్పాన్సర్ బ్యాంకు ఒకటే ఉన్న గ్రామీణ బ్యాంకులను ఒక బ్యాంకుగా మార్చారు. అలా మూడు విడతల్లో వాటి సంఖ్య క్రమంగా తగ్గింంది.
మే 2025లో రాష్ట్రానికి ఒకే గ్రామీణ బ్యాంకు విధానం రావడంతో ఒకనాడు 196 ఉన్న వీటి సంఖ్య 28కి వచ్చింది. నరసింహం కమిటీ సిఫారసులతో రూపంలో, వ్యాపారంలో చిన్నగా మొదలైన ఈ బ్యాంకులు యాభై ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులకులోనై నేడు వాణిజ్య బ్యాంకులకు దీటుగా తమ ఉనికిని చేరుకుంటున్నాయి.
పంట రుణాలు
1975లో మొదలైన గ్రామీణ బ్యాంకులు అనంతరం పదేండ్లకాలంలో దేశవ్యాప్తంగా 196కు చేరాయి. వీటి వల్ల రైతులకు సాగు పెట్టుబడుల కోసం సకాలంలో పంట రుణాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయం అనుబంధ రుణాలుగా భూమి చదును, బావుల తవ్వకం, పంపుసెట్లు, ఎడ్లబండి, ట్రాక్టర్లు తదితర అవసరాలు తీర్చేందుకు అయిదు, పదేండ్ల కాలంలో కిస్తుల రూపంలో చెల్లించే టర్మ్ లోన్లు కూడా వారి చేతికందాయి. పాడి పరిశ్రమ, కోళ్ల ఫారం, గొర్రెల పెంపకం లాంటి గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు పెట్టుబడులు లభించాయి.
రేషన్ షాపు డీలర్లకు స్వల్పకాలిక ఋణం దొరకడంతో సరుకులు సకాలంలో పంపిణికి మార్గం సుగమమైంది. దేశంలో మహిళల స్వయం సహాయక సంఘాలు ఎంతో సమర్థంగా, విజయవంతంగా నడుస్తున్నాయంటే వాటి వెనుక గ్రామీణ బ్యాంకుల కృషి, తోడ్పాటు ఎంతో ఉంది. చిన్న మొత్తాల అప్పుల వితరణ వల్ల గ్రామీణ బ్యాంకులు చాలాకాలం నష్టాల్లో నడిచాయి. ప్రభుత్వం గ్రామీణ బ్యాంకులను తొలుత సామాజిక లాభాలు ఆర్జిస్తున్న సంస్థలుగానే పరిగణించింది. పల్లెల్లోకి గ్రామీణ బ్యాంకుల రాకతో తమ వ్యాపారం దెబ్బతినిందని అధిక వడ్డీలు దండుకొనేవారు అన్నారంటే గ్రామీణ బ్యాంకుల స్థాపనకు అంతకు మించి ప్రయోజనం లేదు.
బలహీన వర్గాలకు సబ్సిడీ పథకాలు రావడంతో గ్రామీణులకు టర్మ్ లోను సౌకర్యంతోపాటు పూర్తి అప్పును తిరిగి కట్టే భారం తగ్గింది. వడ్డీ రాయితీలు, రుణమాఫీలు అవసరానికి ఆదుకుంటున్నాయి.
- బద్రి నర్సన్