V6 న్యూస్ చానెల్ కు జాతీయస్థాయి అవార్డు

V6 న్యూస్ చానెల్ కు  జాతీయస్థాయి అవార్డు

వీ6 న్యూస్ పదేండ్లు పూర్తిచేసుకున్న టైంలో చానెల్ కు జాతీయస్థాయిలో ప్రత్యేకమైన గౌరవం దక్కింది. మీడియా న్యూస్ ఫర్ యూ డాట్ కామ్ ప్రకటించిన గేమ్ చేంజర్స్-2021 అవార్డును వీ6 అందుకుంది. పదేండ్లుగా వార్తాప్రసారాలతో కోట్లమంది తెలుగు ప్రేక్షకుల ఆదరణ సాధించినందుకు సౌత్ న్యూస్ మీడియా కేటగిరిలో ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. వీ6 సీఈవో, చీఫ్ ఎడిటర్ అంకం రవి, చానెల్ టీమ్ కు అవార్డు ప్రకటించింది. శుక్రవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను అందించారు. చానెల్ తరపున ఫోర్త్ డైమెన్షన్ మీడియా సీఈవో బి.శంకర్ అందుకున్నారు.

తెలంగాణలో వివిధ అంశాల్లో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడంలో చానెల్ కీలకపాత్ర పోషించిందని అవార్డుల జ్యూరీ ప్రశంసించింది. బ్రాడ్ కాస్ట్ న్యూస్ మీడియాలో మూసధోరణులను బద్దలు కొడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వార్తాప్రసారాలు అందిస్తోందని చెప్పింది. మీడియా న్యూస్ ఫర్ యూ 2018 నుంచి మీడియా అవార్డులను అందిస్తోంది. జాతీయ స్థాయిలో మీడియా, కార్పొరేట్ సంస్థల కీలక ప్రతినిధులు జ్యూరీ సభ్యులుగా అవార్డులకు ఎంపిక చేస్తారు. ఈ జ్యూరీలో మీడియాన్యూస్ ఫర్ యూ ఎడిటర్ ఇన్ చీఫ్ ఉమానాథ్, స్పెన్సర్స్ రిటెయిల్ ఎండీ, సీఈవో దేవేంద్ర చావ్లా, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ భాస్కర్ దాస్, రెడిఫ్యూజన్ నెట్ వర్క్ ఎండీ డాక్టర్ సందీప్ గోయల్, ఈరోస్ ఇంటర్నేషనల్ సీఈవో ప్రదీప్ ద్వివేది, క్యాన్ కో అడ్వర్టైజింగ్ ఫౌండర్ రమేష్ నారాయణ్, ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ సీఈవో ఎన్.చంద్రమౌళి ఉన్నారు.

 

 

మరిన్ని వార్తల కోసం

టీచర్ నిర్వాకం..స్కూల్కు 20 లక్షల బిల్లు

 ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్