బైజూస్ ​ఆఫీసులు బంద్..

బైజూస్ ​ఆఫీసులు బంద్..
  •     ఒక్క హెడాఫీసే పని చేస్తోంది
  •     ఖర్చులను తగ్గించుకోవడానికే

న్యూఢిల్లీ : ఎడ్​ టెక్ సంస్థ  బైజూస్​కు రోజురోజుకూ కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.  బెంగుళూరులోని తన హెడ్​ క్వార్టర్ తప్ప, మిగతా అన్ని ఆఫీసులను ఖాళీ చేసింది.   గత ఆరు-ఎనిమిది నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, సంస్థను  లాభదాయకంగా మార్చడానికి ఆఫీసుల కాంట్రాక్టులను పునరుద్ధరించడం లేదు. అయితే 6–10 తరగతుల విద్యార్థులు చదువుకునే దాదాపు 300 ట్యూషన్ సెంటర్‌‌‌‌లు పని చేస్తాయి.

ప్రస్తుతం బైజూస్​కు 14 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఇక నుంచి వీరంతా ఇంటి నుంచే పనిచేస్తారు. కంపెనీ తన ఉద్యోగులందరికీ ఫిబ్రవరి నెల వేతనాలను పూర్తిగా చెల్లించలేదు. వర్కింగ్ క్యాపిటల్ కొరతను కూడా ఎదుర్కొంటోంది.  రైట్స్​ఇష్యూ ద్వారా ఇటీవల సేకరించిన 200 మిలియన్​ డాలర్ల డబ్బు వాడుకునే అవకాశం లేకపోవడంతో జీతాలను ఇవ్వలేకపోయామని సంస్థ అంటోంది.  కంపెనీ వరుసగా రెండవ సంవత్సరం కూడా బిలియన్ డాలర్ల నష్టాలను నమోదు చేసింది.

2022  ఆర్థిక సంవత్సరంలో రూ. 8,240 కోట్ల నష్టంతో పోలిస్తే, మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 8,553 కోట్లకు పెరిగింది.  ఫౌండర్​ బైజూ రవీంద్రన్‌‌‌‌ను తొలగించడానికి ఓటు వేసిన  ప్రధాన పెట్టుబడిదారులతో యాజమాన్యం న్యాయపోరాటం చేస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌లో కనీసం ఐదు దివాలా పిటిషన్‌‌‌‌లను కూడా ఎదుర్కొంటోంది..