- గుంటూరుపల్లి వద్ద ప్రమాదం
- మృతులు ఏపీలోని నెల్లూరుకు చెందిన వారుగా గుర్తింపు
ఖిలా వరంగల్ (మామునూర్), వెలుగు : బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా మామునూరు సమీపంలోని గుంటూరుపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. మామునూరు సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని నెల్లూరు జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన కనిగిరి విష్ణువర్ధన్ (22), శేషయ్య(23) జగిత్యాలలో ఉంటూ ఓ కాంట్రాక్టర్ వద్ద మేస్త్రీలుగా పనిచేస్తున్నారు.
విష్ణువర్ధన్ సోదరుడు నెక్కొండలో పనిచేస్తుండండతో.. అతడిని కలిసేందుకు ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మామునూరు సమీపంలోని గుంటూరుపల్లికి వద్దకు రాగానే నెక్కొండ నుంచి వరంగల్‌వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది.
విష్ణువర్ధన్ అక్కడికక్కడే చనిపోగా.. శేషయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని శేషయ్యను ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. మామునూరు సీఐ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
