
- రూ.73 కోట్ల నిధులు మంజూరైనా ఏడాదిగా పనులు పెండింగ్
వనపర్తి, వెలుగు:వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. ఈ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే విషయంపై సంబంధిత అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ మలుపు నుంచి మెట్టుపల్లి, రాజపేటను కలుపుతూ 100 ఫీట్ల వెడల్పుతో నాలుగులేన్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.73 కోట్లు మంజూరయ్యాయి. రెండు వైపులా పనులు ప్రారంభించగా, అర్థాంతరంగా ఆగిపోయాయి.
గతంలో బైపాస్ కోసం శ్రీనివాసపురం వైపు ఉన్న ఫారెస్ట్ భూమిని తీసుకోగా, పనులు నిలిచిపోవడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ స్థలంలో మొక్కలు నాటారు. ఈ రోడ్డు పూర్తయితే 44 నంబర్ హైవేను ఆనుకొని ఉన్న కొత్తకోట నుంచి పాన్‌గల్, కొల్లాపూర్ వెళ్లే వారు పట్టణంలోకి రావాల్సిన అవసరం ఉండదు.
కచ్చా రోడ్డుపై మొక్కలు నాటేశారు..
మెడికల్, నర్సింగ్ కాలేజీకి వచ్చేందుకు రాజపేట నుంచి కాలేజీ వరకు వంద ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వనపర్తి–-పెబ్బేరు రోడ్డులో వే సైడ్ మార్కెట్ వద్ద బైపాస్ రోడ్డును ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి శ్రీనివాసపురం మీదుగా మెట్టుపల్లి వరకు రోడ్డు వేసి మొత్తం 8 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును ప్రతిపాదించారు. వే సైడ్ మార్కెట్ నుంచి శ్రీనివాసపురం, మెట్టుపల్లి మధ్య కొంత ఫారెస్ట్ భూమి ఉంది. ఆ ల్యాండ్‌ను కొందరు రైతులు కొన్నేండ్లుగా సాగు చేసుకుంటుండగా, వారికి నచ్చజెప్పి ఖాళీ చేయించిన స్థలంలో కచ్చా రోడ్డు వేశారు. ఏడాదిగా పనులు నిలిచిపోవడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ స్థలంలో మొక్కలు నాటారు. రోడ్డు వేయకుండా, తమకు కాకుండా చేశారని ఆ భూమిని గతంలో సాగు చేసిన రైతులు వాపోతున్నారు.
పట్టణంలో నుంచి వెళ్లాల్సిందే..
కలెక్టరేట్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు పెబ్బేరు రోడ్డులో ఉన్నాయి. కాలేజీ, కలెక్టరేట్లో పని చేసే ఉద్యోగులు, అధికారులు అక్కడికి వెళ్లాలంటే కొత్తకోట నుంచి వనపర్తి పట్టణంలోకి వచ్చి వివేకానంద చౌరస్తా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో దాదాపు 8 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాలి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్ గల్ మండలాల ప్రజలు మెట్టుపల్లి మీదుగా పట్టణంలోకి వచ్చి పాలిటెక్నిక్ కాలేజీ మలుపు మీదుగా ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది.
బైపాస్ నిర్మాణం పూర్తయితే హైవేను అనుకొని ఉన్న కొత్తకోట నుంచి రాజపేట వరకు వచ్చి అక్కడి నుంచి నేరుగా మెడికల్ కాలేజీ, కలెక్టరేట్‌కు వెళ్లవచ్చు. అలాగే కొల్లాపూర్ నుంచి మెట్టుపల్లి వద్ద రోడ్డు ఎక్కి కొత్తకోట హైవే వరకు వెళ్లవచ్చు. దీంతో దూరాభారం తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది.
60 ఫీట్ల రోడ్డుకే పర్మిషన్?
వనపర్తి, -ఆత్మకూరు రోడ్డు, వనపర్తి-, కొల్లాపూర్ రోడ్డు కనెక్టివిటీ కింద ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ నుంచి బైపాస్ రోడ్డుకు రూ.73 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. దీంతో 100 పీట్ల వెడల్పులో రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. వనపర్తి, -కొల్లాపూర్ రోడ్డులో శ్రీనివాసపురం వద్ద రోడ్డు కోసం తీసుకున్న ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్‌కు పర్మిషన్ తీసుకోలేదు. దీంతో ఫారెస్ట్ ల్యాండ్‌లో వేసిన కచ్చా రోడ్డుపై మొక్కలు నాటినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇటీవల ఈ వ్యవహారంపై ఆర్అండ్బీ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చర్చలు జరిపారు. 60 ఫీట్ల రోడ్డుకు మాత్రమే అనుమతి ఇచ్చే అధికారం తమకు ఉందని, 100 ఫీట్ల రోడ్డుకు పర్మిషన్ కావాలంటే ఉన్నతాధికారులను సంప్రదించాల్సి ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉంటే ఇటీవల ఎమ్మెల్యే మేఘారెడ్డి బైపాస్ రోడ్డు వేసే రాజపేట నుంచి వే సైడ్ మార్కెట్ వరకు మార్నింగ్ వాక్ చేసి రోడ్డుతో నష్టపోయే రైతులకు న్యాయం చేస్తామని, బైపాస్ రోడ్డుకు సహకరించాలని
కోరారు.
సమస్య తీరగానే పనులు ప్రారంభిస్తాం..
బై పాస్ రోడ్డు నిర్మాణం కోసం అడ్మినిస్ర్టేషన్ శాంక్షన్ వచ్చింది. పనులూ కొంత ప్రారంభమయ్యాయి. శ్రీనివాసపూరు వద్ద ఫారెస్టుకు చెందిన ల్యాండ్ నుంచి రోడ్డు వేసే విషయంలో ఆర్అండ్బీ అధికారులు ఫారెస్టు అధికారులతో చర్చించారు. త్వరలోనే సమస్య కొలిక్కి వస్తే పనులు వేగవంతమవుతాయి. - దేశ్యానాయక్, ఈఈ ఆర్అండ్బీ