బైపోల్ హీట్: ఇండ్ల కిరాయిల రికార్డు ఫీట్

బైపోల్ హీట్: ఇండ్ల కిరాయిల రికార్డు ఫీట్

మునుగోడు నియోజకవర్గంలో ఇండ్ల కిరాయిలు భారీగా పెరిగాయి. ఉప ఎన్నిక ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇంటి కిరాయిలు అనూహ్యంగా పెరిగిపోయాయి. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో నాయకులకు తాత్కాలిక నివాసం కోసం అద్దె ఇళ్లన్నీ బుక్ చేసుకున్నారు. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఇంచార్జ్ లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉండడంతో స్థానికంగానే మకాం వేశారు. దాదాపు అన్ని ప్రముఖ పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులంతా మునుగోడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మండలాల వారీగా మకాంవేసి పార్టీ గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రచారం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు.. ఇతర  ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు మునుగోడులోనే ఉంటున్నారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇండ్ల కిరాయిలు భారీగా పెరిగాయి. మున్ముందు ఎన్నికల హడావిడి పెరిగే అవకాశం ఉండటంతో.. అద్దె ఇండ్లు దొరకటమే కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రోజు రోజుకూ పెరుగుతున్న రాజకీయ వేడి

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నాయకులను మండలాలకు ఇంచార్జీలుగా నియమించాయి పార్టీలు. దీంతో వాళ్లంతా స్థానికంగా ఉండి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. టీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్  పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇండ్లకు కిరాయిలు భారీగా పెరిగాయి. మొన్నటివరకు డబుల్ బెడ్రూం ఇండ్లకు అద్దె 5 వేలుంటే.. ఇప్పుడు రెట్టింపు అయింది. మున్ముందు డిమాండ్ ను బట్టి మరింత పెరిగే అవకాశం ఉంది.   

మరో 4 నెలలు మునుగోడులోనే మకాం

మూడు ప్రధాన పార్టీలు వచ్చే మూడు, నాలుగు నెలలపాటు మునుగోడు నియోజకవర్గంలోనే మకాంవేసి ప్రచారం చేయనున్నాయి. కార్యకర్తలను కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు.. ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయనున్నాయి. దీంతో పార్టీ బాధ్యతలు తీసుకున్న నాయకులు.. తమ అనుచరులతో కలిసి నియోజకవర్గంలో అద్దె ఇండ్లు వెతుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మునుగోడు, చండూరు, చౌటుప్పల్ సహా పలు ప్రాంతాల్లో అద్దెలు అమాంతం పెరినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇండ్లు దొరికే పరిస్థితి లేకపోవటంతో.. పక్కనే ఉన్న నల్గొండలో మకాం వేసేలా నాయకులు ప్లాన్ చేస్తున్నారు. 

అద్దె ఇండ్ల కోసం కార్యకర్తలకు పురమాయింపు

ఉప ఎన్నికకు ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు. అయినా అధికార టీఆర్ఎస్ గెలుపు కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. మునుగోడు ఎన్నికకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న మంత్రి జగదీష్ రెడ్డి కూడా నియోజకవర్గంలో అద్దె ఇంటి కోసం వెతుకుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు నియోజకవర్గానికి రానుండటంతో.. మంత్రి త్వరగా ఓ ఇంటిని అద్దెకు తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇతర నాయకుల కోసం అద్దె ఇండ్లు చూడాలని పార్టీ కార్యకర్తలకు పురమాయించినట్లు వార్తలు వస్తున్నాయి.  

బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి సహా పలువురు కీలకనేతలు నియోజకవర్గంలోనే ఉండనున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్ గా గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ నాయకులు ఇక్కడే ఉండి గెలుపు కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా మునుగోడుకు తరలివచ్చారు. ఎన్నికల షెడ్యూల్  ప్రకటించే లోపు అన్ని పార్టీలు తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలోని ఇండ్ల అద్దెలు భారీగా పెరిగాయి.