బెంగాల్​లో అడుగుపెట్టాలంటే నా డెడ్​బాడీ దాటాలె

బెంగాల్​లో అడుగుపెట్టాలంటే  నా డెడ్​బాడీ దాటాలె

నా ప్రభుత్వాన్ని బర్తరఫ్​ చేసినా సీఏఏ అమలు చేయం: మమతా బెనర్జీ ఫైర్

జైల్లో పెట్టినా వెనక్కి తగ్గేది లేదు

కోల్​కతాలో దీదీ భారీ ర్యాలీ

‘‘నేను బతికున్నంత వరకు సిటిజన్​షిప్​ చట్టం, ఎన్ఆర్సీని బెంగాల్​లో అమలు చేసేదే లేదు. నా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినా.. నన్ను జైల్లో పెట్టినా ఈ ‘బ్లాక్ లా’ అమలుకు అంగీకరించం. చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన తెలుపుతాం. కచ్చితంగా అమలు చేయాలనుకుంటే నా డెడ్​బాడీని దాటే బెంగాల్​లో అడుగుపెట్టాలి” అని కేంద్రాన్ని పశ్చిమబెంగాల్​ సీఎం  మమతా బెనర్జీ హెచ్చరించారు. ఆదివారం కోల్​కతాలో సీఏఏకు వ్యతిరేకంగా తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ) ఆధ్వర్యంలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్​ రోడ్​ నుంచి జొరసాంకో ఠాకూర్ బరీ వరకు చేసిన ఈ ర్యాలీలో వేలాది మంది టీఎంసీ కార్యకర్తలు పాల్గొన్నారు. నో సీఏఏ, నో ఎన్ఆర్సీ అనే ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. బీజేపీ ఇచ్చిన డబ్బులతో కొందరు రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్నారని, బెంగాల్​కు చెందని కొందరు వ్యక్తులు మైనార్టీలకు స్నేహితులుగా నటిస్తూ విధ్వంసాలకు దిగుతున్నారని ఆరోపించారు. వారి ట్రాప్​లో పడవద్దని బెంగాలీలకు సూచించారు.

అందరినీ అడ్డుతొలగించుకుని ఈ చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ అనుకుంటోందని, దానికి చాన్సే లేదని, రాష్ట్రం నుంచి ఎవరినీ పంపించేది లేదని, అన్ని మతాలు, కులాలు, వర్గాలు కలిసి ఉండాలనేది తమ అభిమతమని అన్నారు. ఆందోళనకారులు విధ్వంసాలకు దిగవద్దని, ఇది నిరసన లక్ష్యాన్ని దెబ్బ తీస్తుందని సూచించారు. ఢిల్లీ జామియాలో స్టూడెంట్లపై పోలీసు చర్యను ఆమె తప్పుపట్టారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు చేసేందుకు అదనపు బలగాలు కావాలా అని కేంద్ర ప్రభుత్వం అడుగుతోందని, బీజేపీ అధికారంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో లా అండ్​ ఆర్డర్​ను కంట్రోల్​ చేసి తర్వాత ఇతరులకు నీతులు చెప్పాలని సూచించారు. బెంగాల్​ పోలీసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. సీఏఏ, ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రపతికి లక్షలాది లెటర్లు రాయాలని, ఇందుకు ఇంక్​ను కాకుండా రక్తాన్ని వాడాలని సూచించారు.

రైల్​సర్వీసులు బంద్​

బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల మధ్య రైలు సర్వీసులను ఈస్ట్రన్​ రైల్వే నిలిపేసింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది.

పర్సనల్గా వివరణ ఇవ్వండి మమతకు గవర్నర్​ సూచన

సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్​లో ప్రస్తుత పరిస్థితులపై తనను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్.. సీఎం మమతా బెనర్జీకి సూచించారు. మంగళవారం రాజ్​భవన్​కు రావాలన్నారు. తాజా పరిస్థితులపై బెంగాల్ సీఎస్, డీజీపీ తనను కలిసి వివరాలు అందజేయకపోవడంపై ఆయన ట్విట్టర్​లో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఆదేశాలను వారు పట్టించుకోకపోవడాన్ని ఊహించలేదని, ఇది సరికాదని పేర్కొన్నారు. మరోవైపు మమతా బెనర్జీ ర్యాలీలను కూడా గవర్నర్​ తప్పుపట్టారు. రాష్ట్రంలో పరిస్థితులు హింసాత్మకంగా ఉంటే సీఎం ర్యాలీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది రెచ్చగొట్టే చర్య అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సీఎం కృషి చేయాలని సూచించారు.