
- గొడవపడ్డ వారే చంపారని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం వెల్చాల్ గ్రామానికి రాఖీ పండగకి వచ్చిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్‌పేట మండలంలోని వెల్చాల్ గ్రామానికి చెందిన బన్నె సాయికిరణ్ (22) హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాఖీ పండగకి సొంత గ్రామమైన వెల్చాల్ వచ్చాడు. ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో బెల్ట్ షాపు వద్ద దుర్గం చెరువు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మీ చెల్లెలు పెళ్లికి తీసుకున్న రూ.5 వేలు ఎప్పుడిస్తావని సాయికిరణ్‌తో గొడవపడ్డారు.
విషయం తెలుసుకున్న సాయికిరణ్ తల్లి బన్నె గోవిందమ్మ తన కొడుకు ఆచూకీ తెలియడం లేదని గొడవ చేసిన వ్యక్తుల ఇంటి వద్దకు పోయి ప్రశ్నించింది. సోమవారం మర్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద సాయి కిరణ్ శవమై కనిపించాడు. ఒక్కగానొక్క కుమారుడిని గొడవపడిన యువకులే హత్య చేశారని మృతుడి తల్లి గోవిందమ్మ, తండ్రి మల్లేశం, కుటుంబీకులు ఆరోపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.