ఆలస్యంగా వచ్చాడని క్యాబ్ డ్రైవర్ పై యువకుల దాడి

ఆలస్యంగా వచ్చాడని క్యాబ్ డ్రైవర్ పై యువకుల దాడి

ఓలా క్యాబ్ డ్రైవర్ ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో ఏడుగురు యువకులు అతన్ని చితకబాదిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  డ్రైవర్ ను కొట్టి అతని యజమానిని సంఘటన స్థలానికి రప్పించి యజమానిని సైతం కొట్టడంతో ఆ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాల పాలైన ఆ డ్రైవర్ పాతబస్తీకి చెందినట్టుగా సమాచారం. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉప్పరపల్లికి చెందిన వినయ్ రెడ్డి ఓలా యాప్ ద్వారా కారు బుక్ చేశాడు. ఫైజర్ ఈ బుకింగును  స్వీకరించి ఉప్పరపల్లి ప్రాంతానికి వచ్చాడు. అరగంట పాటు ఆలస్యమైందంటూ వినయ్ రెడ్డి తన స్నేహితులతో కలిసి గొడవపడి, డ్రైవర్ ను చితకబాదాడు.

 దీంతో డ్రైవర్ ఆ విషయాన్ని తన ఓనర్ కు తెలపడంతో ఓనర్ సంఘటన స్థలానికి వచ్చారు. అనంతరం ఓనర్ పై సైతం ఆ యువకులు దాడి చేశారు. డ్రైవర్ తో పాటు ఓనర్ను రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు చితకబాది వదిలివేశారు. దీంతో డ్రైవర్ ఓనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులను సంప్రదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఇరువురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫైజర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఫైజర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.