
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మంగళవారం (అక్టోబర్ 7) ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో సుమారు రూ.24,634 కోట్లతో కూడిన నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని 18 జిల్లాలను కవర్ చేసే ఈ నాలుగు ప్రాజెక్టులు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను సుమారు 894 కి.మీ.ల మేర మరింత విస్తరించనున్నాయి. కేబినెట్ భేటీ అనంతరం సమావేశ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి కార్యక్రమం కింద సుమారు రూ.24,634 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. 2030-2031 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గఢ్లోని 18 జిల్లాలను ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కవర్ చేయనున్నదని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులు ప్రజలు, వస్తువులు, సేవల రవాణాను సజావుగా కనెక్టివిటీ చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు సాంచి, సాత్పురా టైగర్ రిజర్వ్, భీంబెట్కా రాక్ షెల్టర్, హజారా జలపాతాలు, నవేగావ్ నేషనల్ పార్క్ వంటి ప్రముఖ గమ్యస్థానాలకు రైలు కనెక్టివిటీని అందిస్తుంది.
కేంద్రం ఆమోదించిన నాలుగు ప్రాజెక్టులు ఇవే:
వార్ధా - భుసావల్ - 3వ & 4వ లైన్ - 314 కిమీ (మహారాష్ట్ర)
గోండియా - డోంగర్‌ఘర్ - 4వ లైన్ - 84 కి.మీ (మహారాష్ట్ర & ఛత్తీస్‌గఢ్)
వడోదర - రత్లాం - 3వ & 4వ లైన్ - 259 కి.మీ (గుజరాత్ & మధ్యప్రదేశ్)
ఇటార్సి - భోపాల్ - బినా 4వ లైన్ - 237 కి.మీ. (మధ్యప్రదేశ్)