
- కోటా–బుండి ప్రాంతంలో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- రూ.1,507 కోట్లతో నిర్మాణం
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని కోటా – బుండి ప్రాంతంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. 1,089 ఎకరాల్లో.. రూ.1,507 కోట్లతో విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ మేరకు కొన్ని కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
‘‘రెండేండ్లలో కోటా–బుండి గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్టును కంప్లీట్ చేస్తాం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. రాజస్తాన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊపిరి పోస్తుంది. ఏడాదికి 20 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తది. ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి రాజస్తాన్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిధులు సమకూరుస్తది.
ఎయిర్ బస్ ఏ321 టైప్ విమానాలు సేవలందించేలా ఎయిర్‌పోర్ట్‌ను డెవలప్ చేస్తాం. సుమారు 50 ఎకరాల్లో టెర్మినల్‌ను నిర్మిస్తున్నాం. గంటకు వేయి మంది ప్యాసింజర్లను హ్యాండిల్ చేస్తుంది. ఏ321 టైప్ విమానాలు నిలిపేలా 7 పార్కింగ్ బేస్‌లను నిర్మిస్తాం. రెండు లింక్ ట్యాక్సీ వేస్, ఏటీసీ కమ్ టెక్నికల్ బ్లాక్, ఫైర్ స్టేషన్, కార్ పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నాం’’ అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
2014లో దేశ వ్యాప్తంగా 74 ఎయిర్‌పోర్టులు ఉంటే.. ఇప్పుడు 162కు చేరుకున్నాయని చెప్పారు. 2014లో ఎయిర్ ప్యాసింజర్లు 16.80 కోట్లు ఉంటే.. ఇప్పుడు 41.2 కోట్లకు పెరిగారని తెలిపారు. కాగా, ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు’ను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
రూ.8 వేల కోట్లతో భువనేశ్వర్ రింగ్ రోడ్
రూ.8307.74 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో భువనేశ్వర్ బైపాస్ నిర్మించేందుకు కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘‘6- లేన్ యాక్సెస్ -కంట్రోల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ గా ఇది ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రూ.8,307 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ రోడ్ కంప్లీట్ అయితే.. భువనేశ్వర్ చుట్టుపక్క ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద టార్గెటెడ్ సబ్సిడీని 2025 – 26 కోసం రూ.12,000 కోట్లతో కొనసాగించాలని కేబినెట్ ఆమోదించింది’’అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భువనేశ్వర్ బైపాస్ నిర్మాణాన్ని ఆమోదించడంతో ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు.
జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా
జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నేడు పార్లమెంట్లో ‘జమ్మూకాశ్మీర్ పునర్వవస్థీకరణ' బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు రిపబ్లిక్ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టి చర్చ మొదలుపెడతారని పేర్కొంది.