28 వేల కోట్లతో ‘ఉడాన్’ విస్తరణ.. కొత్తగా 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్‌‌‌‌లు

28 వేల కోట్లతో ‘ఉడాన్’ విస్తరణ.. కొత్తగా 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్‌‌‌‌లు

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగాన్ని విస్తరించడంతో పాటు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునికీకరించేలా కేంద్ర కేబినెట్ బుధవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. దేశంలోని రీజనల్ ఎయిర్ కనెక్టివిటీకి చెందిన 'ఉడాన్' పథకానికి మార్పులు చేసి.. స్కీమును పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు కోసం పదేండ్ల(2026–27 నుంచి 2035–36 వరకు) కాలానికి రూ.28,840 కోట్లు నిధులను కేటాయించినట్లు చెప్పారు. 

ఇందులో రూ.12,159 కోట్లతో కొత్తగా 100 విమానాశ్రయాలను, రూ.3,661 కోట్లతో 200 ఆధునిక హెలిప్యాడ్‌‌‌‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సామాన్యులకు తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలు అందించేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలకు రూ.10,043 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా స్వదేశీ తయారీ హెచ్‌‌‌‌ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాలను 2 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఐవీఎఫ్ఆర్టీ అప్‌‌‌‌గ్రేడ్ కు 1,800 కోట్లు

ఇమ్మిగ్రేషన్ అండ్ వీసా సేవలను డిజిటలైజ్ చేసే ఐవీఎఫ్ఆర్టీ పథకాన్ని 2031 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీని కోసం  రూ.1,800 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025’కు అనుగుణంగా అక్రమ వలసలను అరికట్టడం, సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌‌‌‌ల ఏర్పాటు, అంతర్జాతీయ ప్రయాణికులకు సురక్షితమైన సేవల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి ఐవీఎఫ్ఆర్టీ వ్యవస్థ అప్‌‌‌‌గ్రేడ్ అనివార్యమైందన్నారు.