ఆసరా పింఛన్లలో అక్రమాలు

ఆసరా పింఛన్లలో అక్రమాలు
  • 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల చెల్లింపులు  
  • అర్హత లేకపోయినా 16 శాతం కుటుంబాలకు పెన్షన్ 
  • అప్లికేషన్లు, అర్హుల ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదు 
  • కాగ్ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆసరా పింఛన్లలో అక్రమాలు జరిగాయని కాగ్ వెల్లడించింది. డిపార్ట్ మెంట్ కొంతమంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినప్పటికీ, జాబితా నుంచి వాళ్ల పేర్లు తొలగించలేదని తెలిపింది. ఫలితంగా 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని చెప్పింది. దివ్యాంగుల కేటగిరీలో రూ.71.90 కోట్లు, బీడీ కార్మికుల కేటగిరీలో రూ.446.96 కోట్లు, ఒంటరి మహిళల కేటగిరీలో రూ.1.70 కోట్లు, ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇవ్వడం ద్వారా రూ.14.83 కోట్ల మేర కలిపి మొత్తం రూ.535.39 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయని వివరించింది.

మరోవైపు 2018 నుంచి 2021 వరకు సగటున నెలకు 2.30 లక్షల మందికి పెన్షన్ చెల్లించలేదని తెలిపింది. పింఛన్లకు లబ్ధిదారులను గుర్తించేందుకు 2014లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్కీమ్ గైడ్ లైన్స్ లో ఉందని గుర్తు చేసింది. అయితే ఆసరా లబ్ధిదారుల డేటాను సమగ్ర కుటుంబ సర్వే డేటాతో పోలిస్తే.. 19 శాతం కుటుంబాల డేటా అందుబాటులో లేదని పేర్కొంది. 

కాగ్ గుర్తించిన లోపాలివీ.. 

అర్హత లేకపోయినా 16 శాతం కుటుంబాలకు పెన్షన్ చెల్లించారు. 
    

ఆసరా అప్లికేషన్ల పరిశీలన, అర్హుల గుర్తింపు పక్రియ సరిగా జరగలేదు. ఇదంతా ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో జరిగింది. ఇందులో ఉద్యోగుల పాత్ర ఉంది.
    

రైతుబంధు డేటాను 2018 నుంచి 2020 వరకు ఆసరా లబ్ధిదారుల వివరాలతో విశ్లేషించగా, ఆసరా స్కీమ్ గైడ్ లైన్స్ లో నిర్దేశించిన పరిమితికి మించి అధికంగా భూమి ఉన్న వ్యక్తులకు రూ.67.41 కోట్ల మేర అక్రమ చెల్లింపులు చేశారు. 
    

రైతు బీమా డేటాతో 2018 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఆసరా లబ్ధిదారుల డేటాను విశ్లేషించగా.. 367 మంది లబ్ధిదారులకు చనిపోయిన తర్వాత  రూ. 90 లక్షల పెన్షన్ తప్పుగా చెల్లించారు.
    

రవాణా శాఖ డేటా, ఆసరా లబ్ధిదారుల డేటాను పోల్చి చూడగా.. ఫోర్ వీలర్ ఉన్న వ్యక్తులకు అర్హత లేకున్నా రూ.51.98 కోట్లు పెన్షన్ కింద చెల్లించారు.