
- కాగ్ తాజా నివేదికలో వెల్లడి
- నెలకు యావరేజ్‌గా 150 కోట్ల లోపే గ్రాంట్ ఇన్ ఎయిడ్
- నాన్ ట్యాక్స్ రెవెన్యూ క్వార్టర్లో వచ్చింది రూ.1,066 కోట్లే
- సొంత ఆదాయంతో గాడిన పడిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: గడిచిన మూడు నెలల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కంట్రిబ్యూషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి కేవలం రూ.433 కోట్లు మాత్రమే వచ్చాయి. అంచనా వేసిన దాంట్లో ఈ మొత్తం 1.90 శాతం మాత్రమే. అంటే నెలకు యావరేజ్‌గా రూ.150 కోట్లు కూడా రాలేదని స్పష్టమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.22,782 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రతినెలా కనీసం వెయ్యి కోట్లు రావాల్సి ఉండగా.. అందులో పది శాతం వరకే వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కేంద్రం తోడ్పాటు ఆశించినమేర లేదని అధికారులు పేర్కొంటున్నారు.
కంప్రోల్టర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తాజాగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలతో కూడిన జూన్ నెల రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులోని వివరాలను గమనిస్తే ఈ మూడు నెలల్లో కేంద్రం నుంచి పెద్దగా నిధులు రాలేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా గ్రోత్ లేదు. ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి రూ.1,066 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రభుత్వ భూములను సేల్ చేయడం, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను వేలం వేయాల్సి ఉండగా అవి ఇంకా ప్రాసెస్‌లోనే ఉండటంతో పన్నేతర రాబడి తగ్గినట్లు తెలుస్తోంది.
అన్ని కలిపి రూ.57,499 కోట్లు రాబడి
కాగ్ రిపోర్ట్ ప్రకారం ఓవరాల్‌గా 3 నెలల్లో రాష్ట్రానికి రూ.57,499 కోట్ల రాబడి వచ్చింది. అంచనా వేసిన మొత్తం ఆదాయంలో 20.19%గా ఉన్నది. ఇందులో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.35,721.81 కోట్లుగా ఉన్నది. జీఎస్టీ రాబడి ఆశించిన మేరనే ఉన్నది. రిజిస్ట్రేషన్ల రాబడి క్రమంగా పుంజుకుంటున్నది. ప్రతినెలా వెయ్యి కోట్ల పైనే ఆదాయం వస్తోంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రూ.12,622 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 3,712 కోట్లు, సేల్స్ ట్యాక్స్‌తో రూ.8,466 కోట్లు వచ్చింది. రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ.4,501 కోట్లు, కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా రూ. 5,090 కోట్లు రాగా.. ఇక ఇతర మార్గాల ద్వారా రూ.1,499 కోట్లు వచ్చాయి.
ఇదిలా ఉండగా మూడు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,266 కోట్లు అప్పులు తీసుకున్నది. ఇది అంచనా వేసిన దానిలో 36.79%గా ఉంది. ప్రతినెలా యావరేజ్‌గా రూ.7 వేల కోట్ల మేర అప్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లో మొత్తం రూ.52,559 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు చేసిన రెవెన్యూ వ్యయం రూ.47,804 కోట్లుగా ఉంది. జీతాలకు రూ.11,608 కోట్లు ఖర్చు చేశారు. వడ్డీ చెల్లింపులకు రూ. 6,772.85 కోట్లు వెచ్చించారు. సబ్సిడీల కోసం రూ.5,932 కోట్లు ఖర్చు చేశారు.
కొత్త ఆస్తుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఉద్దేశించిన మూలధన వ్యయం రూ.4,755 కోట్లు మాత్రమే ఉన్నది. ఇది బడ్జెట్‌లో 13.03% మాత్రమే కావడం గమనార్హం. ఇక రూ.10,582 కోట్ల భారీ రెవెన్యూ లోటును రాష్ట్రం నమోదు చేసింది. బడ్జెట్‌లో రూ.2,738.33 కోట్ల రెవెన్యూ మిగులును అంచనా వేయగా, ప్రస్తుతం లోటులో ఉంది.