రిలీఫ్​ రైడర్స్​ ఏం కావాల్నన్నా తెచ్చిస్తరు

V6 Velugu Posted on Jun 03, 2021

‘నలుగుర్లోకి పోకుండ పైలంగుండమనే ముచ్చట అందరు జెప్తున్నరు. మరి... పానం బాగుండాల్నంటే గోలీ ఏస్కోవాలె. గోలీ కోసమని బయటకిపోతే పానమే పోతదని భయమైతంది  బిడ్డా. ఇట్లయితే బతికేదెట్ట?’ అనంటంది యాదవ్వ. ‘సాయపడేటోళ్లు లేని యాదవ్వ అసొంటోళ్లు  మాకు ఫోన్​ చేయుర్రి. మీ బిడ్డ లెక్కనే సూసుకుంటం. ఏం గావాల్నంటే అది తెస్తం’ అంటున్నరు రిలీఫ్​ రైడర్స్​ హైదరాబాద్​. ‘ఒంటరిగ ఉన్న ముసలోళ్లే గాదు, హోమ్​ ఐసోలేషన్​ల ఉన్నోళ్లు గూడ మెడిసిన్స్​, ఫ్రూట్స్​, కూరగాయలు, సరుకులు కావాల్నంటె అడగండి. ఇంటికొచ్చి ఇస్తం’ అంటున్నరు.  ఆపతి వస్తె యాదికుంచుకుని ఫోన్​ కొట్టుర్రి. గంతె! 

రిలీఫ్​​ రైడ్​​ 
బియ్యం, పప్పులు, ఆయిల్​ ప్యాకెట్​, షుగర్, పోపు గింజలు, పసుపు, ఉప్పు, కారం లాంటి కిరాణా సరుకులున్న కిట్​ని పేదోళ్లకు ‘‘డ్రై రేషన్​ కిట్​’ పేరుతో ఫ్రీగా ఇస్తున్నరు. కొవిడ్​ టైమ్​ల పేదోళ్లకు సాయం చేసే ఎన్​జీవో సాయంతోని ఈ సర్వీస్​ మొదలుపెట్టిన్రు. ఇట్ల పేదోళ్లకు, కొవిడ్​ పేషెంట్స్​కి సాయం చేయాల్ననుకునే మనసున్నోళ్లు, సంస్థలు మమ్మల్ని కాంటాక్ట్​ అయితే మేం ఫ్రీగా ఇంటింటికీ చేరేస్తామంటున్నరు. మెడిసిన్స్, ఫుడ్​, సరుకులు డెలివరీ చేసేందుకు సైకిల్​ మీద పోతున్నప్పుడు దారిల కనబడే స్వీపర్స్, శానిటరీ వర్కర్స్​, కానిస్టేబుల్స్​, బిచ్చగాళ్లకు మాస్కులు, శానిటైజర్స్​​ పంచుతున్నరు. ‘మంచి చేయాల్నని మనసుల ఉంటె.. 
మాతో చేయికలపనీకి రారీ’ అంటూ రిలీఫ్​ రైడర్స్​ వెల్​కమ్​ చెప్తున్నరు. ఈ రైడ్​తోని బాడీ ఒక్కటే కాదు మైండ్​ కూడా ఇంకా స్ట్రాంగ్​గ, హెల్దీగా అయితదంటున్నరు.

దేశంల కరోనా వైరస్​ దెబ్బకి ఇబ్బంది పడనోళ్లు లేరు. కరోనా రోగమొచ్చి ఒకలేడిస్తె. కరోనా రాకున్న బతుకులు ఆగమై ఇంకొకల్లు ఏడుస్తున్నరు. లోకమంత ఈ తీరుగుంటె ముసలోళ్లు బాధలు ఇంకెట్లుంటయి? కాలు బయట పెట్టాల్నంటె వయసోళ్లే భయపడుతున్నరు. ఇగ కాలు తీసి కాలు మోపలేని ముసలోళ్లకు సాయం జేసేటోళ్లు లేకుంటె.. ఎన్ని బాధలు? ఆ వయసుల బీపీ, చక్కెర.. ఏదో ఒక రోగముంటది. మాత్ర తెచ్చుకోని మింగాలె. కూరగాయలు, సరుకులు తెచ్చుకోవాలె. పట్టించుకునేటోళ్లు లేని అవ్వలు ఎంత బాధపడుతున్నరో జూసి వాళ్లకు ఏ తీర్గనైన సాయం జేయాల్నని సైక్లింగ్​ క్లబ్​ మెంబర్స్​ అందరూ కలిసి బెంగళూరుల ‘రిలీఫ్​ రైడ్​’ మొదలువెట్టిన్రు. వాళ్ల లెక్కనే ఫిట్​నెస్​ కోసం సైక్లింగ్​  చేసే హైదరాబాద్​ రైడర్స్​ గూడ మనవంతు సాయం జేద్దమనుకున్నరు. సంతనా సెల్వన్ (బైస్కిల్​ మేయర్​ ఆఫ్​ హైదరాబాద్) ఇంకొంతమంది రైడర్స్​తోని కలిసి ఏప్రిల్​ 30 తారీఖున ‘రిలీఫ్​ రైడర్స్​ హైదరాబాద్’ని షురూ​ జేసిండు. ‘‘మందు గోలీలే గాదు కూరగాయలు, పండ్లు, సరుకులు..  ఏది కావాల్నన్నా మాకు ఫోన్​ జేయుర్రి. మీరడిగింది, మీ ఇంటికొచ్చి ఇస్త’’మని చెప్పిన్రు. అప్పటి సంది రోజుకు వంద కాల్స్​ వస్తున్నయంట. 20 మందితోని స్టార్ట్​ అయిన ‘రిలీఫ్​ రైడర్స్ హైదరాబాద్​’ల వారం తిరిగే సరికే వంద మంది చేరిన్రు. ఉద్యోగం చేస్తనే ఈ టీమ్​ల వలంటీర్​గా చేయొచ్చు. సైక్లింగ్​ చేస్తూ నలుగురికి సాయపడుతూ ఉండాలనుకునే మంచి మనసుంటె చాలు. అసుంటి మనసున్నోళ్లు ఇప్పుడు 170 మంది దాంక పనిచేస్తున్నరు. 
కోరింది కాదనకుండ
సాయం కావాల్సినోళ్లు ఫోన్​ చేస్తే ‘ఏం సాయం గావాలె?, ఎక్కడుంటరు? అని ముందుగాల కనుక్కుంటరు. తర్వాత రైడర్స్​ వాట్సాప్​ గ్రూప్​ల మెసేజ్​ పెడతరు. ఆ టైమ్​ల డ్యూటీ అయిపోయి ఎవలుంటరో వాళ్లు ‘నేను హెల్ప్​ చేస్త’ని రెడీ అయితరు. సాయం కోసం కాల్​ చేసినోళ్లతో మాట్లాడి ‘ఎట్ల రావాలె? ఏం తేవాల్నో’ వలంటీర్​ ముందే ఓపాలి మాట్లాడుతరు. చెప్పినట్టు చేసి వస్తరు. ఇట్ల చేస్తుండె సరికి కొవిడ్​ పీక్స్​ల ఉన్నప్పుడు రోజుకు వందకు పైగా కాల్స్​ వస్తుండెనట. ‘రెండు వారాల నుంచి కాల్స్​ తగ్గుతున్నయ్​. కాల్స్​ రాని రోజు కోసం ఎదురుచూస్త ఈ హెల్పింగ్​ రైడ్​ని నడిపిస్తనే ఉంట’మని సంతనా సెల్వన్​ అంటున్నడు. 
అడిగింది లేదనుకుండ
రిలీఫ్​ రైడర్స్​ని ఏదైనా తెమ్మని చెబితే.. ముందుగాలె డబ్బులు ఇయ్యాల్సిన పనిలె. వాళ్లె సొంత పైసలతోని కొనుక్కొస్తరు. ఇంటికొచ్చినంక ఆ పైసలిస్తే తీస్కుంటరు. మందులు దొరక్క ఈ మధ్య ఇబ్బందులు ఎక్కువయినై. జాబ్​ చేస్త వలంటీర్​గా చేసేటోళ్లకు ఆ టాస్క్​ చానా కష్టం. అందుకని ఈ టీమ్​ల ఉన్న డాక్టర్లు డిస్ట్రిబ్యూటర్స్​తోని మాట్లాడి కొన్ని ముఖ్యమైన మందులు మా కోసం లేట్​ చేయకుండ, లేదనకుండ ఇయ్యాల్నని ముందే మాట్లాడి పెట్టుకున్నరంట. అందుకని ‘అడిగిన మందు దొరకలే తాత’ అని ఏ రైడర్​ చెప్పడు. ఈ సర్వీస్​ స్టార్ట్​ చేసిన కొత్తల చానా మంది వలంటీర్స్​ ప్లాస్మా దానం చేసింన్రు. బ్లడ్​ ప్లేట్​లెట్స్​ కావాల్నంటె డొనేట్​ చేసింన్రు. అంబులెన్స్​, ఆక్సిజన్​ సపోర్ట్​ కోసం గూడ కాల్​ చేసినా హెల్ప్​ చేస్తరు. 
పనిలేని రోజుల్ల పైసలేసుకోని 
లాక్​ డౌన్​ దెబ్బకి అందాల్సిన పైసలు అందక చానా మంది ఆగమాగమైతున్నరు. ఇట్లనే ఇబ్బందిపడే ముసలోళ్లుంటె వాళ్లకెట్ల సాయం జేయాలని రిలీఫ్​ రైడర్స్​ అందరూ అనుకున్నరు. ఇందుల ఉన్న వలంటీర్లల జాబ్​ చేసెటోళ్లె ఎక్కువ. డాక్టర్లు. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు, మేనేజర్లు.. ఇట్ల రకరకాల జాబ్స్​ చేసేటోళ్లంతా ఉన్నరు. ఎక్కువ శాలరీ వచ్చేటోళ్లు 10  పర్సెంట్​ డొనేట్​ చేద్దమనుకున్నరు. పేద ముసలోళ్లు, ఐసోలేషన్​ల ఉండి పైసలకు ఇబ్బంది పడుతున్న పేషెంట్స్​కి మెడిసిన్స్​, ఫుడ్​ ఫ్రీగా ఇస్తున్నరు. పైసలిచ్చేంత శక్తి లేని వలంటీర్లు, శక్తికిమించి సాయం జేస్తమని ముందుకొచ్చిన్రు. అదెట్లంటే?.. ఇంట్లనే కమ్యూనిటీ కిచెన్​ స్టార్ట్​ చేసిండ్రు. మియాపూర్​, మణికొండ, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, మలక్​పేట ఇంకొన్ని చోట్ల ఇట్లాంటి కిచెన్స్​ ఉన్నయ్. ఆ కిచెన్​ నడిపే వలంటీర్​ దగ్గర రైడర్​ ఫుడ్​పార్సిల్​ని పికప్​ చేస్కోని, డెలివరీ చేస్తడు. కొవిడ్​ బారినపడి మంచం పట్టిన వాళ్లకు కావాల్సిన ఫుడ్​ ప్రిపేర్​ చేస్తున్నమన్నరు. 
సిటీల ఏ ఏరియాల ఆకలితో ఉన్నోళ్లు 99597 71673కి కాల్​ చేస్తే, నిమిషాల్ల వాళ్ల ఆకలి తీరుస్తున్నరు వలంటీర్స్. వండిపెట్టేటోళ్లు లేని కొవిడ్​ పేషెంట్స్​కి నెగెటివ్​ వచ్చేదాంక మంచి ఫుడ్​, కావాల్సిన మందులు ఇస్తున్నమని రైడర్స్​ని కో– ఆర్డినేట్​ చేస్తున్న వలంటీర్​ రవి సాంబారి చెబుతున్నడు. ఒక ఎం.ఎన్​.సి.ల జాబ్​ చేస్తనే  నలుగురిని గైడ్​ చేస్తున్న ఫీలింగ్​ డబ్బుసంపాదించిన దానికంటే మంచిగున్నదని చెబుతున్నడు రవి.                 ::: నాగవర్ధన్​ రాయల

కాల్​ చేస్తే ఇంటికొస్తరు 
హైదరాబాద్​ రిలీఫ్​ రైడర్స్​ సిటీల అన్ని ఏరియాల్ల ఉన్నరు. గ్రేటర్​ హైదరాబాద్​ల ఉండేటోళ్లు వీళ్లని సాయం అడగొచ్చు. గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపాలిటీల అయిదు జోన్లు పెట్టినట్టే వీళ్లు సిటీని మూడు జోన్ల లెక్క చేసుకుని కో-ఆర్డినేట్​ చేసుకుంటున్నరు. సాయం కావాల్సినోళ్లు ఉండే ఏరియాని బట్టి, ఆ జోన్​కి సంబంధించిన నంబర్​కి ఫోన్​ చేస్తే సాయం చేయనీకి రెడీగా ఉన్న రైడర్​ నిమిషాల్ల ఇంటికొస్తరు. 
సికింద్రాబాద్..​   95661 70334
పద్మారావు నగర్​, బోయినపల్లి, మారేడ్​పల్లి, పంజాగుట్ట, బేగంపేట, బాలానగర్​, నాచారం, శామిర్​పేట, అమీర్​పేట, ఆల్వాల్​, ఈసీఐఎల్​, ఉప్పల్​, తార్నాక దగ్గరి ఏరియాలు  
ఓల్డ్​ హైదరాబాద్​...   99597 71673
రాజేంద్ర నగర్​, ఆర్​.టి.ఎల్​. క్రాస్​ రోడ్స్​, అత్తాపూర్​, మెహిదీపట్నం, చార్మినార్​, ఫలక్​నుమా, నాంపల్లి, అబిడ్స్​,  ఎంజే మార్కెట్​, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీ నగర్ దగ్గరి ఏరియాలు 
సైబరాబాద్...​   97017 44814
బంజారాహిల్స్​, జూబ్లిహిల్స్​, గచ్చిబౌలి, మణికొండ, ఫిల్మ్​నగర్​, కూకట్​పల్లి, మాదాపూర్​, కొండాపూర్, నానక్​రామ్​ గూడ, నార్సింగ్​, మియాపూర్​, బీహెచ్​ఈఎల్​ దగ్గరి ఏరియాలు 

Tagged Hyderabad, food, corona, HELP, life style, , Relief riders

Latest Videos

Subscribe Now

More News