కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అని పిలవాలి

కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అని పిలవాలి

న్యూయార్క్: కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమైందంటూ చైనాపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పలుమార్లు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. మరోమారు కరోనా విషయంలో డ్రాగన్‌‌పై ఆయన విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారిని చైనా వైరస్‌‌గా పిలవాలన్నారు. కరోనా వైరస్ అంటే ఇటలీలోని అందమైన ప్రదేశం అనేలా వినిపిస్తోందని.. అందుకే దాన్ని చైనా వైరస్‌‌గా పిలవాలని చెప్పారు. అమెరికా ఆర్థికంగా దూసుకెళ్తున్న తరుణంలో చైనా నుంచి వచ్చిన ప్లేగు తమను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ‘అది చైనా వైరస్. కరోనా వైరస్ కాదు. కరోనా పదం వినడానికి ఇటలీలోని ఓ అందమైన ప్రదేశంలా అనిపిస్తోంది. అది కరోనా.. చైనా వైరస్. ఇలా పిలవడానికి వాళ్లు ఇష్టపడరు. ర్యాడికల్ లెఫ్టిస్టులు ఇలా పిలవడానికి అస్సలు ఇష్టపడరని మీకు తెలుసా?’ అని ఎన్నికల క్యాంపెయినింగ్‌‌లో ట్రంప్ పేర్కొన్నారు.