కర్నాటకలో ప్రచార హోరు.. పోటాపోటీగా ప్రధాన పార్టీల క్యాంపెయిన్

కర్నాటకలో ప్రచార హోరు.. పోటాపోటీగా ప్రధాన పార్టీల క్యాంపెయిన్
  • కర్నాటకలో ప్రచార హోరు
  • పోటాపోటీగా ప్రధాన పార్టీల క్యాంపెయిన్
  • మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలంటున్న యోగి
  • అప్పుడు నానమ్మ.. ఇప్పుడు నేను ప్రచారం చేస్తున్నాం: ప్రియాంక

మాండ్య, చిక్ మంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ‘నువ్వా.. నేనా’ అన్నట్టు పోరు నడుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పోరాడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడడంతో ఈ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలు ముగ్గురు బుధవారం ఒకేరోజు ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్, నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రెండ్రోజులుగా రాష్ట్రంలోనే ఉన్నారు. 

మతం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు: యోగి 

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆయన బుధవారం మాండ్య జిల్లాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు కల్పించింది. వాటిని మేం రద్దు చేశాం” అని యోగి చెప్పారు. ‘‘1947లో దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించారు. మళ్లీ ఇప్పుడు మరో విభజనకు మేం సిద్ధంగా లేము. మతపరమైన రిజర్వేషన్లు దేశానికి మంచిది కాదు” అని అన్నారు. ఉత్తరప్రదేశ్​లో డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి జరుగుతోందని, కర్నాటకలో మరోసారి బీజేపీకి  అవకాశం ఇవ్వాలని యోగి కోరారు. 

అధికారం కోసమే మతం..: రాజ్ నాథ్ 

కాంగ్రెస్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగాన్ని అవమానించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అధికారంకోసం మతాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. 

రాష్ట్రంలో.. కమీషన్ల సర్కార్

రాష్ట్రంలో కమీషన్ల సర్కార్ పాలన సాగుతోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘‘బీజేపీ సర్కార్  కాంట్రాక్టర్లను వేధిస్తోంది. 40% కమీషన్లు తీసుకుంటోంది. ఉద్యోగాల భర్తీలోనూ కమీషన్లు దండుకుంటోంది” అని ఆమె ఆరోపించారు. బుధవారం చిత్రదుర్గలో ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. అనంతరం చిక్ మంగళూర్ లో ర్యాలీలో మాట్లాడారు. ‘గతంలో నానమ్మకు జరిగినట్టే, ఇప్పుడు రాహుల్​కు జరిగింది. ఇద్దరిపై అక్రమ కేసులు పెట్టి, అనర్హత వేటు వేశారు’ అని అన్నారు. ‘‘ఈ రోజు మా కుటుంబం కష్టకాలంలో ఉంది. 1978లో నానమ్మ కూడా కష్టకాలంలో మీ దగ్గరికి వచ్చి ఇదే గ్రౌండ్​లో మీతో మాట్లాడారు. ఆ రోజు మీరంతా నానమ్మ వెంట నిలబడ్డారు. ఇప్పుడు మాకు కూడా అండగా ఉంటారనే నమ్మకం ఉంది” అని అన్నారు.