ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి ఇంటికే : మామిడాల యశస్విని

ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి ఇంటికే : మామిడాల యశస్విని

పాలకుర్తి, వెలుగు : ఈ నెల 30న ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు పర్వతగిరిలోని తన ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని పాలకుర్తి కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ మామిడాల యశస్విని అన్నారు. గడప గడపకు కాంగ్రెస్‌‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఝాన్సీరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు మూడుసార్లు ఎర్రబెల్లిని గెలిపిస్తే అభివృద్ధి పేరుతో కమీషన్లు తీసుకొని వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన కాంగ్రెస్‌‌ నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తిలో కనీసం ఇంటర్‌‌, డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేయించలేకపోయాడని ఎద్దేవా చేశారు. తాము సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వచ్చే జీతం కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తానని చెప్పారు. ఎర్రబెల్లి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా తమ వెంట ఉన్నారన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామిగౌడ్, బైరు భార్గవ్‌‌, బొమ్మగాని భాస్కర్, జలగం కుమార్‌‌ పాల్గొన్నారు.