బీసీలు ఏకరూప సమాజంగా మారగలరా..?

బీసీలు ఏకరూప సమాజంగా మారగలరా..?

వెనుకబడిన కులాలు (బీసీలు) ఒక చట్టపరమైన వర్గంగా ఉన్నప్పటికీ, సామాజికంగా ఏకరూపత కలిగిన సమాజంగా ఇంకా రూపొందలేదు. ఇవి ఎంబీసీ, డీఎన్​టీ,  సంచార జాతుల వంటి వివిధ కులాలు, సామాజిక సమూహాలుగా విభజనకు గురయ్యాయి. కొంతమంది బీసీ నాయకులు ఉన్నత కులాలతో సమానంగా ఉండేందుకు ఉన్నత కులాల జీవనశైలి, ఆచారాలను అనుకరించడం ద్వారా తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి సంస్కృతీకరణ చేస్తున్నారు. 

జనాభా పరంగా దేశంలో సగం జనాభా వీరిదని అంచనా. అయినప్పటికీ బీసీలు ఇంకా ఒక భావజాల శక్తిగా మారలేదు. వారు ఉన్నత కులాలు, అత్యంత దిగువ కులాల నడుమ మధ్య స్థాయిలో ఉన్నారు. కాబట్టి, రాజకీయ పరివర్తనకు వారి స్థితి కీలకం.  కానీ, బీసీలు ఇంకా రాజకీయ శక్తిగా రూపొందలేదు. 

వారి సంఖ్యాబలం ఆధారంగా నాయకత్వం పై నుంచి  పుట్టింది. నాయకులు తమ ఉప-కులాల బలంపై ఎక్కువగా ఆధారపడ్డారు.  బ్యాక్‌‌‌‌వర్డ్ కులాలందరి మధ్య భావజాల ఐక్యతను డెవలప్​ చేయలేదు. వారి రాజకీయ పురోగతి సామాజిక న్యాయంకోసం జరిగే  రెండో స్వాతంత్ర్య పోరాటంతో సమానమని, రాజ్యాంగ నిర్మాతలు ఊహించినట్లు గ్రహించాలి.

కులాన్ని రాజ్యాంగం కేవలం ఆర్టికల్ 340, 41, 42 కింద మాత్రమే గుర్తించింది. కొందరు డిమాండ్ చేస్తున్నట్లు అన్ని కులాలు రిజర్వేషన్లు పొందలేవు.  రిజర్వేషన్లు పొందని కులాలు ఆచరణలో ఉన్నత కులాలుగా ఉండి, పార్టీలను నడిపిస్తున్నాయి. 1950 తర్వాత రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో  కులాలు లేవు.  కాబట్టి, కులాల కోసం ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు రాజ్యాంగ విరుద్ధం.  ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు కులరహిత దేశాన్ని సృష్టించాలని కోరుకున్నారు. 

రిపబ్లిక్ ఏర్పడిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా కులం ఉనికిలో ఉన్న కారణాలను పార్లమెంట్ చర్చించాలి.  లేదా, పార్లమెంట్ కులవ్యవస్థ ఇక ఆచరణలో లేదని ప్రకటించవచ్చు. బ్యాక్‌‌‌‌వర్డ్ కులాలు ఇటీవల ఎక్కువగా  జాతీయ చర్చల్లో  కనిపిస్తున్నాయి.  జాతీయ రాజకీయ పార్టీలు వారి బలాన్ని గుర్తించాయి. కానీ, కులాల పాత్ర గురించి గందరగోళంలో ఉన్నాయి. 

యూపీ, బిహార్​లో కీలకపాత్ర 

బీసీలు ఏకరూప సామాజిక విభాగంగా మారగలరా?  ఇప్పటివరకు వారు రాజ్యాంగం సృష్టించిన కులాల సమూహంగా మాత్రమే బీసీలు ఉన్నారు. వారు ఇంకా ఒక సామాజికవర్గంగా రూపొందలేదు. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఏమిటంటే,  బీసీలను అధికార పార్టీతోపాటు  ప్రత్యర్థి పార్టీలు కూడా ఉపయోగించుకోవచ్చు. యూపీ, బిహార్‌‌‌‌లో  బీసీలు  ఇప్పటికే ఓబీసీ, ఎంబీసీ, ఈబీసీలుగా  విభజనకు గురై సంప్రదాయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. 

 ఈ విభజనే యూపీలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి  ప్రధాన కారణంగా మారింది. అత్యంత వెనుకబాటు కులాలు (నోమాడ్స్) ఉత్తర భారతదేశంలో ఉన్నత కులాల మార్గదర్శనంలో ప్రత్యేక సామాజిక విభాగంగా రూపొందుతున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో వారు రాజకీయ శక్తిగా మారతారా?  అనేది వేచి చూడాలి. అదేవిధంగా  బిహార్‌‌‌‌లో వచ్చే ఎన్నికల ఫలితాలు ఏమిటో చూడాలి. కానీ, వారు సామాజిక న్యాయశక్తిగా దేశాన్ని నడిపించడానికి లేదా రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాన్ని సాధించడానికి రెండో  స్వాతంత్ర్య  విప్లవాన్ని సాధించలేదని 
నిశ్చయంగా చెప్పవచ్చు.

తెలంగాణ ఏర్పాటుతో ఒక గుర్తింపు వచ్చింది

ఈ రోజు వెనుకబడిన కులాలలో ఒక రకమైన స్వాభిమానంతో కూడిన అవగాహన ఏర్పడింది, ఇది ప్రజాస్వామిక ఆకాంక్షలను స్వీకరించే ఆత్మవిశ్వాసానికి దారితీసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వెనుకబడిన కులాల ఉద్యమంగా ఒక గుర్తింపు అభివృద్ధి చెందింది. కానీ, ఈ స్థితి నగరాలు, పట్టణాలలో మాత్రమే ఉంది.  ఇది చదువుకున్నవారు కార్యకర్తలుగా ఉండటం ద్వారా జరిగింది. 

ఈ కార్యకలాపాలు వివిధ పట్టణాలలో వ్యక్తుల చుట్టూ వ్యక్తిగతంగా కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్,  బీజేపీలు డబ్బు, సీట్లు లేదా పదవులను అందించడం ద్వారా వెనుకబడిన కులాలను ప్రాతినిధ్యం వహించేందుకు నాయకత్వాన్ని ప్రోత్సహించాయి.  బీసీలు నిజంగా తమ పోషకుల నుంచి దూరం జరుగుతారా? అనేది కీలకంగా మారింది.

బ్యాక్‌‌‌‌వర్డ్ కులాలు ఏకమయ్యేనా?

బ్యాక్‌‌‌‌వర్డ్ కులాలు ప్రాథమికంగా ఆధారపడే కులాలుగా ఉన్నాయి.  నాయకులు రాజకీయంగా విధేయ నాయకులుగా ఉద్భవించారు. వారు సామాజిక పరివర్తనను నడిపించడానికి, న్యాయాన్ని సాధించడానికి ఒక భావజాల పార్టీగా ఏర్పడతారా? అన్ని వెనుకబడిన కులాలు ఒక్కటిగా  మారతాయా? ఈ రోజు తెలంగాణలో  నెలకొన్న ఒక తీవ్రమైన సమస్య ఏమిటంటే.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయాలు అవమానకరమైన స్థితికి దిగజారాయి. 

ఆధిపత్య వర్గాల నాయకులు ఉనికిలో ఉన్న కుల వ్యత్యాసాల వాస్తవికతను, రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడిన వెనుకబాటు వర్గాలను సాధికారత చేయవలసిన అవసరాన్ని నెరవేర్చడానికి ఇష్టపడటంలేదు.  అందువల్ల, వారు పార్లమెంటరీ భాషను ఉపయోగించి అవమానకరమైన రాజకీయాలను ప్రవేశపెట్టారు. ఇటువంటి పరిమితుల మధ్య ఉద్భవిస్తున్న బీసీ నాయకులు, గిరిజనులు, షెడ్యూల్డ్ కులాలు, రాజకీయ అధికారం నుంచి మినహాయించిన ఇతరులను ఏకీకృతం చేయడానికి రాజకీయ న్యాయ భావజాలాన్ని అభివృద్ధి చేయగలరా? 

సవాళ్లు, సమస్యలు పరిష్కారం దిశగా సాగాలె

వెనుకబడిన కులాల్లో ప్రాతినిధ్యం లేని అందరికీ  ప్రాతినిధ్యం కోసం,  రాజకీయ న్యాయం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి.  సంచార జాతుల స్థిరనివాసం, ఉపాధి సృష్టి కోసం కేంద్రీకృత పంపిణీ ప్రణాళికకు ఆర్థిక పరివర్తన కోసం ఒక మేనిఫెస్టోను రూపొందించాలి. ఇప్పటివరకు అభివృద్ధి వ్యవస్థాపకుల వైపు దృష్టి సారించింది. కాబట్టి మొత్తం బిజినెస్​ ఉన్నత వర్గాల చేతుల్లోకి వెళ్ళింది. 

ఆర్థిక న్యాయం అంటే కేవలం వారి నుంచి వ్యాపారాన్ని లాగేసుకోవడం కాదు.  వెనుకబడిన కులాలు తమ ముందున్న సవాళ్లు, సమస్యలను ఇంకా పరిష్కరించలేదు.  బీసీలు తమ సమస్యల పరిష్కారం దిశగా పయనిస్తే వారిలో  భావజాల ఐక్యతను తీసుకురాగలవు. కేవలం టికెట్లు లేదా సీట్లు కోరే రాజకీయాల వైపే మొగ్గు చూపితే అవి విధేయత కొనసాగింపునకే  దారితీస్తాయి.

బీసీల మధ్య విభజన రాజకీయాలు

తెలంగాణ ప్రధానంగా కళాకారులు, సేవా కులాలు, నోమాడ్స్ భూమి. వీరు గతంలో వెట్టి చాకిరీ కార్మికులుగా శ్రమ దోపిడీకి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత కొందరు ప్రభుత్వాలలో కులాల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చింది.  ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో, అనంతరం  కేబినెట్‌‌‌‌లో వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం ఉంది. బీసీల నాయకత్వం ఈ విధంగా పై నుంచి పుట్టింది. 

సంఖ్యాబలం ఉన్న వెనుకబడిన కులాల మధ్య మంత్రి పదవుల కోసం తీవ్రపోటీ ఉండటం వల్ల రాష్ట్రంలో వెనుకబడిన కుల ఉద్యమం ఉద్భవించలేదు. ఏ వెనుకబడిన కుల నాయకుడూ తమ ఉప-కుల సోదరుల మద్దతు బేస్‌‌‌‌ను స్థాపించలేదు. బదులుగా, తమ సొంత కుల బలాన్ని ప్రదర్శించి పదవులు కోరారు. దీనివల్ల బీసీల మధ్య విభజన రాజకీయాలు ఏర్పడ్డాయి. 

- ప్రొ. ఇనుకొండ తిరుమలి,
 చరిత్రకారుడు, విద్యావేత్త