పెస్టిసైడ్స్ తో​ క్యాన్సర్

పెస్టిసైడ్స్ తో​ క్యాన్సర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పురుగు మందుల వాడకం 3 మిలియన్ల మంది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. సంవత్సరానికి 20,000 మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. సంతాన ఉత్పత్తి కూడా తగ్గుతున్నది. ఈ పురుగు మందుల వలన ప్రజల ఆరోగ్యం, భూమి, పర్యావరణం దెబ్బతింటున్నాయి. ప్రపంచంలో పురుగు మందుల ఉత్పత్తుల్లో అమెరికా, జపాన్, చైనా, భారతదేశం నాలుగో స్థానంలో ఉన్నాయి. పురుగు మందుల ఉత్పత్తుల్లో భవిష్యత్తులో భారతదేశం ‘The Global Manufacturing Hub’గా తయారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 54,140 మెట్రిక్ టన్నుల పెస్టిసైడ్స్ ను ఉపయోగిస్తున్నది. మొదటి స్థానంలో మహారాష్ట్ర 13,175 మెట్రిక్ టన్నులు,  పంజాబ్ 11,688 మెట్రిక్ టన్నులతో  రెండో స్థానంలో ఉంది. దేశంలో పెస్టిసైడ్స్ మూలంగా ప్రతి సంవత్సరం 42 వేల కోట్ల రూపాయల టర్నోవర్ అవుతున్నట్లు అంచనా!

ధాన్యాలు, కూరగాయల్లో..

 భారతదేశంలో ప్రభుత్వ ఆమోదం పొందిన 318 పురుగు మందుల కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలో ఒక హెక్టారుకు సగటున 500 గ్రాముల పురుగు మందులు ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో ఒక హెక్టారుకు  381 గ్రాముల పురుగుల మందులు వాడుతున్నాం. ప్రపంచ సగటు కంటే తక్కువ. ముఖ్యంగా కూరగాయల సాగులో దాదాపు 13, 14శాతం వరకు పురుగుమందులు వాడతారు, మిరప, బెండకాయలో హెక్టారుకు 5.13 గ్రాముల పురుగుల మందును వాడుతున్నారు. దేశంలో రైతులు ఎక్కువగా నిరక్షరాస్యులు కావడంతో పురుగుల మందుల వాడకంపై దుకాణం యజమానిపైనే ఆధారపడి వాడుతున్నారు. ఏ పంటకు ఏ పురుగుల మందు కొట్టాలో, ఎంత మోతాదులో కొట్టాలో కూడా రైతులకు పెద్దగా అవగాహన  లేదు. పురుగుల బారి నుంచి పంటను రక్షించుకొని ఎక్కువ దిగుబడి రావాలనే  రైతులు పురుగుల మందు ఉపయోగిస్తున్నారు. విచక్షణా రహిత వినియోగం పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా మానవుల ఆరోగ్యానికి కూడా హానికరం. హరిత విప్లవం ప్రారంభంలో  అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధి కోసం వ్యవసాయ రసాయనాలను విస్తృతంగా వినియోగించడం. తత్ఫలితంగా దేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది.  కానీ, పురుగు మందుల వాడకం విస్తృతమవడంతో  అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

 పెస్టిసైడ్స్​తో  అనర్థాలు​

దేశంలో  234 పురుగు మందులలో 24 రకాల పెస్టిసైడ్స్ క్యాన్సర్ కారకాలుగా గుర్తించబడ్డాయి. కూరగాయలు, పండ్లలో క్రిమిసంహారక మందులను నిరంతరం ఉపయోగించడం వల్ల మానవ శరీరంలో ఈ పురుగు మందుల రసాయనాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దేశంలో ప్రజలు వారి ఆహారం ద్వారా ప్రతిరోజూ 0.5 మిల్లీగ్రాముల క్రిమిసంహారకాలను తీసుకుంటున్నారని  శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ‘రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, పరిశోధనా కేంద్రం’ భారతదేశంలో క్యాన్సర్ కు మొదటి కారణం పొగాకు, రెండవ కారణం పురుగు మందుల వాడకం అని ధ్రువీకరించింది. పర్యావరణంపై ప్రభావం పడుతున్నది.   పురుగు మందుల, రసాయనిక ఎరువుల ఉపయోగంతో మెదడు, కాలేయ, చర్మం  పునరుత్పత్తిని , పక్షుల జనాభా తగ్గడానికి దారితీస్తుంది. పక్షుల, జంతువుల మరణాలపై ప్రభావం చూపుతుంది.  పురుగు మందులు, రసాయనిక ఎరువులు మూలంగా భూమిలో రోజు రోజుకూ వానపాముల సంఖ్య తగ్గిపోవడంతో పంటల ఉత్పత్తి తగ్గుతుంది.
 
నీటిపై ప్రభావం

క్రిమిసంహారకాలను పొలానికి ప్రయోగించినప్పుడు అది మొదట మట్టిని కలుషితం చేస్తుంది. తరువాత భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి.  కాబట్టి రైతులు అవసరం మేరకే పురుగుల మందులను, రసాయనిక ఎరువులను వాడాలి. పురుగు మందులను రసాయనిక ఎరువుల ఉపయోగాన్ని దాని వల్ల వచ్చే నష్టాలను రైతులకు ప్రభుత్వాలు వివరించాలి. పురుగు మందుల, రసాయనిక ఎరువుల కంపెనీల పైన ప్రభుత్వ నియంత్రణ పెరగాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు వ్యవసాయంలో  పురుగు మందులు, రసాయనిక ఎరువుల వాడకం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. - 

పులి రాజు, సామాజిక కార్యకర్త
 

  • Beta
Beta feature
  • Beta
Beta feature