కరోనా నివారణకు ధైర్యమే మందు

కరోనా నివారణకు ధైర్యమే మందు
  • 93% పేషెంట్లు ఇంట్లోనే రికవర్​ అవుతున్నరు
  • ఐదు శాతం మందికే ఆక్సిజన్​ అవసరం
  • ఆక్సిజన్​ లెవెల్స్​ 95% కన్నా తగ్గితేనే ఆసుపత్రికి
  • లక్షణాల్లేకుంటే టెస్టు చేయించుకోవద్దు
  • లేనివారికీ సెంటర్ల వద్దే సోకుతోందంటున్న నిపుణులు
  • అవసరం లేకుంటే ఆస్పత్రికి రావొద్దని సూచనలు
  • అవసరమున్నోళ్లకు బెడ్లు వదలాలని సూచన


కరోనా సెకండ్​వేవ్​లో కేసులు పెరిగిపోతుండడంతో జనాలకు బుగులు పట్టుకుంటోంది. అయితే, ఫికర్​ పెట్టుకోవద్దని, ధైర్యంగా ఉంటే మహమ్మారి బెడద నుంచి బయటపడొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలని, వచ్చినా ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. కరోనా వచ్చిందన్న భయంతో ఆసుపత్రికి పోనవసరం లేదని, ఇంట్లోనే 93 శాతం మంది కోలుకుంటున్నారని ధైర్యం చెబుతున్నారు. పాజిటివ్​ వచ్చినోళ్లందరికీ ఆక్సిజన్​ అవసరం లేదంటున్నారు. ఆక్సిమీటర్​లో 95 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్త పడాలని, ఎక్కువ రోజుల పాటు జ్వరం, దగ్గు, నీరసం ఉన్నప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా.. కోలుకుంటున్నోళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. రాష్ట్రంలో కరోనా సోకిన వాళ్లలో వందకు 93 మంది ఎలాంటి ట్రీట్​మెంట్​ లేకుండానే కోలుకుంటున్నారు. మిగతా 7 శాతం మందే ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. అందులోనూ 2 శాతం మంది మామూలు ట్రీట్​మెంట్​తోనే బాగైతున్నారు. ఇంకో ఐదు శాతం మందికి ఆక్సిజన్​ అవసరం పడుతోంది. దీర్ఘకాలిక జబ్బులున్నోళ్లు, కొంచెం లావుగా ఉన్నవాళ్లు, వయసు మీద పడ్డోళ్లే వెంటిలేటర్​పైన ట్రీట్​మెంట్​ తీసుకోవాల్సి వస్తోంది. కొంచెం లేట్​ అయినా అందులోని చాలా మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. వందలో ఇద్దరు కరోనా పేషెంట్లే చనిపోతున్నారు. మార్చి మూడో వారం నుంచి రాష్ట్రంలో సెకండ్​ వేవ్​ మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా 1,14,224 కేసులు నమోదైతే, అందులో 440 మంది చనిపోయారు. మొత్తంగా మన రాష్ర్టంలో 4,11,905 కేసులు నమోదైతే, అందులో 3,40,590 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇంకో 49 వేల మంది హోం ఐసోలేషన్​లో, 20 వేల మంది దవాఖాన్లలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. 

కరోనా వచ్చిన వాళ్లలో చాలా మంది నాలుగైదు రోజులు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే విపరీతమైన ఆయాసం, ఇతర ఇబ్బందులు మోపైతున్నాయి. మొదటి నాలుగైదు రోజులు శరీరంలో గప్​చుప్​గా జరుగుతున్న మార్పులే రెండో వారంలో తీవ్రతకు దారి తీస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల రెండో వారంలో లక్షణాలున్నా, లేకపోయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ‘‘కరోనా సోకిన రెండో వారాన్ని లేట్​ పల్మనరీ స్టేజ్​ అంటాం. ఈ వీక్​లో చాలా అలర్ట్​గా ఉండాలి. దగ్గు, జ్వరం, జలుబు, ఆయాసం వంటి సింప్టమ్స్​ తగ్గిపోయి మళ్లీ వచ్చినా, లేదా మొదట లక్షణాల్లేకుండా ఉండి అప్పుడే మొదలైనా వెంటనే హాస్పిటల్​కు వెళ్లడం మంచిది. లక్షణాలు లేకపోయినా ఆక్సిమీటర్​‌‌తో ఆక్సిజన్​ లెవెల్స్​ను చూసుకోవాలి. 95 శాతం కన్నా తగ్గితే జాగ్రత్త పడాలి’’ అని క్రిటికల్​ కేర్​ ఎక్స్​పర్ట్​, అసోసియేట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ కిరణ్​ మాదాల వివరించారు. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్నోళ్లు, లావుగా ఉన్నవాళ్లు రెండో వారంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

లక్షణాల్లేకుంటే టెస్ట్​ వద్దు

కరోనా లక్షణాలు లేనంత వరకు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ పాజిటివ్​ వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్​ అయితే వెంటనే ఐసోలేషన్​కు వెళ్లిపోవాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ రాజారావు సూచించారు. తర్వాత నాలుగైదు రోజుల్లో లక్షణాలు కనిపిస్తే టెస్టు చేయించుకోవాలన్నారు. ఇంట్లో ఉన్నా, బయటున్నా మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. అవసరం లేకున్నా టెస్ట్​ సెంటర్​ దగ్గరికి వెళ్లొద్దని, కరోనా లేని చాలా మందికి టెస్ట్​ సెంటర్ల దగ్గర మహమ్మారి సోకుతున్న ఘటనలున్నాయని చెప్పారు. లక్షణాలు లేకుంటే అనవసరంగా భయపడి టెస్టు సెంటర్ల దగ్గరకు వెళ్లొద్దని సూచించారు. లక్షణాల్లేని వారికి కరోనా ఉన్నా భయపడాల్సిన పని లేదన్నారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకుని, కొంత డిస్టెన్స్​ పాటిస్తే.. అందులో ఒకరికి వైరస్​ ఉన్నా మరొకరికి సోకే చాన్స్​ చాలా తక్కువని ఆయన చెప్పారు. కాబట్టి ప్రైమరీ కాంటాక్ట్​ అని భయపడిపోయి టెస్టుకు పోవాల్సిన అవసరం లేదన్నారు.
  
ఆక్సిమీటర్లు పెట్టుకోండి

కరోనా వచ్చిందని తెలియగానే కంగారు పడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. కంగారుపడడం వల్లే లేని సమస్యలు వస్తున్నాయంటున్నారు. లక్షణాల్లేని, తక్కువ లక్షణాలున్న కరోనా పేషెంట్లు దానికి తగ్గట్టుగా మందులు వాడితే సరిపోతుందని భరోసా ఇస్తున్నారు. హోం ఐసోలేషన్​లో ఉన్నోళ్లు థర్మోమీటర్​‌‌, పల్స్​ ఆక్సిమీటర్లను తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలని డాక్టర్​ రాజారావు సూచించారు. లక్షణాలు తక్కువున్నాయని నిర్లక్ష్యం చేయొద్దని, మందులు వాడాలని సూచించారు. హ్యాపీ హైపాక్సియా అనే కండిషన్​ వల్ల ఆక్సిజన్​ లెవెల్స్​ తగ్గినా ఆయాసం రాదని, దాని వల్ల అంతా బాగానే ఉందనుకుంటున్నా లంగ్స్​కు ఎటాక్​ అయ్యి ఆక్సిజన్​ లెవెల్స్​ పడిపోతున్నాయని మెడికవర్​ హాస్పిటల్స్​ కన్సల్టంట్​, ఇంటర్​వెన్షనల్​ పల్మనాలజిస్ట్​ డాక్టర్​ మేఘనారెడ్డి చెప్పారు. పల్స్​ ఆక్సిమీటర్​తో ఎప్పటికప్పుడు చెక్​ చేసుకుంటే ఆ పరిస్థితి రాదన్నారు. చేతులు తడిగా ఉన్నా, ఏసీలో ఉన్నా ఒక్కోసారి ఆక్సిజన్​ లెవెల్స్​ తప్పుగా చూపించే అవకాశం ఉందని, కాబట్టి పొడి చేతులు, ఏసీ లేని ప్రాంతంలో ఆక్సిజన్​ లెవెల్స్​ను చెక్​ చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అలాగని గంటగంటకూ చెక్​చేసుకోవాల్సిన పని లేదని, రోజుకు నాలుగైదు సార్లు చెక్​ చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.  

ఈ టెస్టులు చేయించుకోవాలె

కరోనా పాజిటివ్​ వచ్చిందని తెలియగానే కంగారు పడి బ్లడ్​ టెస్టులు, సీటీ స్కాన్లు చేయించుకుంటున్నారని, ఎర్లీ స్టేజ్​లోనే టెస్టులు చేయించుకోవడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా సోకిన మొదట్లో టెస్టులు చేయించుకున్నా అంతా నార్మల్​గానే ఉంటుందంటున్నారు. మందులు వాడితే తక్కువ లక్షణాలున్నా వెంటనే తగ్గిపోతున్నాయంటున్నారు. ‘‘చాలా తగ్గిపోయిన లక్షణాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఒకసారి తగ్గిన సింప్టమ్స్​ మళ్లీ వస్తున్నాయంటే, వెంటనే వెళ్లి డాక్టర్​‌‌ను కలవాలి. ఇలాంటి సమయంలో సీబీపీ, సీఆర్పీ, ఎల్​డీహెచ్​, ఫెర్రిటిన్​ అనే నాలుగు టెస్టులు చేయించుకోవాలి. వాటి ద్వారా పేషెంట్​పరిస్థితేంటో తెలిసిపోతుంది’’ అని క్రిటికల్​ కేర్​ స్పెషలిస్ట్​, అపోలో డాక్టర్​‌‌ శ్రీధర్​‌‌ వివరించారు.
  
ఇవి చెయ్యాలి

హోం ఐసోలేషన్​లో ఉన్నప్పుడు లక్షణాలు లేకపోయినా మాస్క్​ను తప్పనిసరిగా పెట్టుకోవాలె. వారితో పాటు ఇంట్లోని వాళ్లూ మాస్కును వాడాలె. లేదంటే వారికీ వైరస్​ సోకే ముప్పు ఉంటుంది. 
తలుపులు మూసేసి ఏసీలు వాడొద్దు. ఏసీలకు బదులు ఫ్యాన్లు వాడాలి. వెంటిలేషన్​ వచ్చేలా కిటికీలు తెరిచి పెట్టుకోవాలి. 
కరోనా పేషెంట్లు జంక్​ఫుడ్​ తప్ప ఆరోగ్యవంతమైన ఫుడ్​ ఏదైనా తీసుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలూ పెట్టుకోవద్దు. నీళ్లు బాగా తాగాలి. పండ్లు ఎక్కువగా తినాలి. మాంసం కూడా తినొచ్చు.  
షుగర్​‌‌, గుండె, కిడ్నీ, లివర్​ జబ్బులతో బాధ పడేటోళ్లు, లావుగా ఉన్నవాళ్లు పాజిటివ్​ వచ్చిన వెంటనే డాక్టర్​ దగ్గరకు పోవాలి. డాక్టర్​ సూచన మేరకు ఎప్పుడూ వాడే మందులతో పాటు కరోనా మందులనూ వాడాలి. అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. 
 
ఆక్సిజన్​ తగ్గితే ఆందోళన వద్దు 

కరోనా పేషెంట్లలో ఆక్సిజన్​ లెవెల్స్​ 95 శాతానికి తగ్గకుండా చూసుకోవాలి. విరేచనాలు, గొంతు నొప్పి, దగ్గు, కాస్త జ్వరం ఉన్నా పెద్దగా ఆందోళన చెందొద్దు. పాజిటివ్​ ఉన్న వాళ్లో 95 కన్నా ఎక్కువుంటే హాయిగా ఉండొచ్చు. ఒకవేళ 91, 92, 93 వచ్చినా కంగారు పడొద్దు. రెండో చేతికి పెట్టి చెక్​ చేసుకోవాలి. ఆ చేతికీ అదే రీడింగ్​ వస్తే ఇంట్లో ఉన్నవాళ్లవి చెక్​ చేయాలి. పడుకొని చూసుకుంటే కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువగా చూపించినప్పుడు ఓ ఆరు నిమిషాల పాటు నడిచి మళ్లీ చెక్​చేసుకోవాలి. తేడా వస్తే రీడింగ్​లో తేడా ఉన్నట్టు గమనించాలి. ఆక్సిజన్​ లెవెల్స్​ 92 శాతం కన్నా తగ్గితేనే ఆసుపత్రికి వెళ్లాలి. ఆక్సిమీటర్​ లేని సందర్భాల్లో 6 నిమిషాల పాటు నడవాలి. అప్పుడు ఆయాసం రావడం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలొస్తే ఆక్సిజన్​ స్థాయులు తగ్గినట్టు. అయితే, అది కచ్చితమని చెప్పలేం. కానీ, ఒక ఇండికేషన్​ మాత్రం వస్తుంది.  
                                                        - డాక్టర్​ రంగారెడ్డి,  వైరాలాజిస్ట్​​

గర్భిణులకు వచ్చినా కంగారు వద్దు
గర్భిణులకు పాజిటివ్​ వస్తే కంగారు పడొద్దు. డాక్టర్​ సలహాతోనే ఏ మందులైనా వాడాలి. జ్వరం ఉంటే పారాసిటమాల్​ తీసుకోవచ్చు. గైనకాలజిస్ట్​ సూచించిన రెగ్యులర్​ మందులూ వాడొచ్చు. తీవ్రత పెరిగితే మాత్రం పేషెంట్​ పరిస్థితికి తగ్గట్టు ట్రీట్​మెంట్​ చేస్తారు. కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితినీ ఎప్పటికప్పుడు పరీక్షించాలి. కరోనా పేషెంట్లు యాంటీ బయాటిక్స్​ అస్సలు వాడొద్దు. ఇది వైరల్​ ఇన్​ఫెక్షన్​.. బ్యాక్టీరియాతో వచ్చింది కాదు. యాంటీబయాటిక్స్​ వాడినా, షుగర్​ ఉన్నోళ్లు, బీపీ ఉన్నోళ్లూ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు.  
                                                                     –  డాక్టర్​​ నిఖిల జువ్వాడి, యూఎస్​​