రాజ్యాంగంలో లేని గడువును రాష్ట్రపతికి, గవర్నర్కు ఎలా విధిస్తారు? సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న

రాజ్యాంగంలో లేని గడువును రాష్ట్రపతికి, గవర్నర్కు ఎలా విధిస్తారు? సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: గవర్నర్ పంపిన బిల్లులపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని రాష్ట్రపతికి సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువుపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభ్యంతరం తెలిపారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల వ్యవధిలోనే ఆయనకు రాష్ట్రపతి లేఖ రూపంలో అతి పెద్ద సవాల్ ఎదురుకావడం గమనార్హం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 పరిధిలో ఉన్న విశిష్ట అధికారాలను వినియోగించుకుని సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగంలోని లేని గడువును సుప్రీం కోర్టు ఎలా విధిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత ధర్మాసనాన్ని సూటిగా ప్రశ్నించారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు ఉన్న ఆప్షన్స్ ఏంటని సుప్రీం కోర్టును రాష్ట్రపతి స్పష్టత కోరారు. ఆర్టికల్ 200 ప్రకారం.. గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర శాసనసభ చేసిన బిల్లు అమలయ్యేందుకు అవకాశం ఉందేమో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఒక బిల్లును ఆమోదించే సందర్భంలో.. గవర్నర్ మంత్రి మండలి సలహాలకు, సూచనలకు కట్టుబడి ఉండాల్సిందేనా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం కోర్టును ప్రశ్నించారు. ఇలా సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 14 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై స్పందించేందుకు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఐదుగురు అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంది.

రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి తప్పనిసరిగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తొలిసారిగా గడువును నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి కూడా జ్యుడీషియల్ రివ్యూకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నెలల తరబడి పెండింగ్‎లో పెట్టడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‎తో కూడిన బెంచ్ ఈమేరకు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు, గవర్నర్ల ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపాలని కోర్టు రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది.Image

‘‘ఆర్టికల్ 201 ప్రకారం, ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినట్టయితే.. దానిని రాష్ట్రపతి ఆమోదించాలి, లేదంటే తిరస్కరించాలి. కానీ రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలన్నది రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంతమాత్రాన రాష్ట్రపతికి ‘పాకెట్ వీటో’ అధికారం ఉందని అనుకోరాదు. అందుకే రాష్ట్రపతి బిల్లు అందిన తేదీ నుంచి తప్పనిసరిగా మూడు నెలల్లోపు ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాల్సిందే. రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించడంలో ఈ సాధారణ న్యాయ సూత్రం తనకు వర్తించదని అనుకోరాదు” అని బెంచ్ అభిప్రాయపడింది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం విశేషం. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ చర్యలకు ఉపక్రమించింది.