ఆధారాలు ఎన్నడో ఇచ్చాం.. నిజ్జర్ హత్య కేసుపై ట్రూడో కామెంట్స్

ఆధారాలు ఎన్నడో ఇచ్చాం..  నిజ్జర్ హత్య కేసుపై  ట్రూడో కామెంట్స్
  • ఉక్రెయిన్ ప్రెసిడెంట్​తో కలిసి కెనడా ప్రధాని ప్రెస్ మీట్

టొరంటో: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ల హస్తం ఉందని చెప్పే ఆధారాలను తాము చాలా వారాల కిందటే ఇండియాకు అందించామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు భారత్ తమకు సహకరించాలని కోరారు. శుక్రవారం టొరంటోలో ఆయన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండియా, కెనడా మధ్య ఉద్రిక్తత గురించి విలేకరులు ప్రశ్నించగా ట్రూడో ఈమేరకు మళ్లీ ఆరోపణలు చేశారు.

కెనడా నుంచి టెర్రర్​ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ నిజ్జర్ గత జూన్​లో బ్రిటిష్ కొలంబియాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనక ఇండియన్ ఏజెంట్ల హస్తం ఉందంటూ గత సోమవారం ట్రూడో ఆరోపించాడు. నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై ఫైవ్ ఐస్ (అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా) ఇంటెలిజెన్స్ కూటమి నుంచి సమాచారం అందిందని చెప్పారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. కెనడా నుంచి తమకు ఎలాంటి ఆధారాలు అందలేదని స్పష్టం చేసింది.