ఎన్నికల ప్రచారంలో కెనడా ప్రధానిపై రాళ్ల దాడి

ఎన్నికల ప్రచారంలో కెనడా  ప్రధానిపై రాళ్ల దాడి

మరో రెండు వారాల్లో కెనడా దేశంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం ఎదురైంది. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నందుకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమ మధ్యకు వచ్చిన ప్రధానిపై రాళ్లు విసిరి నిరసన తెలియజేశారు. ఒంటారియా లండన్ టౌన్ లో జరిగిందీ ఘటన.

బ్రాంట్ ఫోర్ట్, ఒంటారియో ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన కొంత మంది సహచరులతోపాటు పలువురు పాత్రికేయులతో కలసి బస్సులో బయలుదేరారు. ఒంటారియా లండన్ టౌన్ లో తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న జనం ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయాణిస్తున్న బస్సుపై గులక రాళ్లతో దాడి చేశారు. ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి వ్యక్తిగత సిబ్బంది ఆయనను దాడి నుంచి తప్పించినా పలువురు సిబ్బందితోపాటు పాత్రికేయులకు రాళ్ల దెబ్బలు తగిలాయి. కరోనా నిబంధనలపై ఆగ్రహంతో ఉన్న జనం నిబంధనలు సవరించమని కోరుతున్నా ప్రధాని పట్టించుకోలేదు.

వ్యాక్సినేషన్ తపపనిసరి చేయడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇదే తరుణంలో ఎన్నికలు ముంచుకురావడంతో ప్రధానికి తమ నిరసనలు ఎదురవుతుండగా తాజాగా రాళ్లదాడి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే రాళ్ల దాడిని ప్రధాని జస్టిన్ ట్రూడో లైట్ తీసుకున్నారు. గతంలో కూడా తనపై గుమ్మడికాయ విత్తనాలు విసిరారంటూ దాడి ఘటననున తేలిక చేసే ప్రయత్నం చేశారు.