నాలా ఆక్రమణలపై నజర్‌‌ .. కబ్జాల తొలగింపు, కాల్వ విస్తరణకు కసరత్తు

నాలా ఆక్రమణలపై నజర్‌‌ .. కబ్జాల తొలగింపు, కాల్వ విస్తరణకు కసరత్తు
  • ఆఫీసర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే నాయిని
  • వర్షాకాలంలోగా పనులు పూర్తి చేసేలా ప్లాన్‌‌

నయీంనగర్‌‌ నాలా విస్తరణ పనులు ప్రారంభించేందుకు వస్తుంటేనే కొందరు ఫోన్లు చేసి విస్తరణ ఆపాలని ప్రెజర్‌‌ పెడుతున్నరు, ఆ ఒక్కటి తప్ప ఏదైనా అడగాలని వారికి చెబుతున్న, నాలా ఆక్రమణలను ఉపేక్షించేదే లేదు, మా నాన్న  ఆక్రమించినా తొలగించాల్సిందేనని ఆఫీసర్లకు చెప్పిన, కూల్చివేతల విషయంలో ఆఫీసర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఆక్రమణల తొలగింపులో ఏ లీడర్‌‌ కూడా తలదూర్చరు, నాలా విస్తరణ, నగర అభివృద్ధి కోసం సలహాలు ఇచ్చేలా 10 నుంచి 12 మందితో కమిటీ వేసి నిర్ణయాలు తీసుకుంటం’ ఫిబ్రవరి 7న నయీంనగర్‌‌ నాలా అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌రెడ్డి చెప్పిన మాటలివి.

హనుమకొండ, వెలుగు : వర్షాకాలం వస్తుందంటేనే గ్రేటర్‌‌ ప్రజలు గడగడలాడుతున్నారు. నగరంలోని నాలాలన్నీ ఆక్రమణలతో కుచించుకుపోవడంతో వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది. ఇందుకు ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలే కారణమని ఆఫీసర్లు తేల్చినా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వరంగల్‌‌కు ముంపు ముప్పును తొలగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నాలాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ఆఫీసర్లు యాక్షన్‌‌ ప్లాన్‌‌ రెడీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

వందల్లో ఆక్రమణలు

వరంగల్‌‌ ట్రై సిటీలో ప్రధానంగా నయీంనగర్, భద్రకాళి, బొందివాగు నాలాల గుండా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ మూడు నాలాలు కలిపి సుమారు 24.5 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. అయితే కొందరు వ్యక్తులు రాజకీయ బలంతో నాలాలపైనే బిల్డింగ్‌‌లు కట్టగా, మరికొంతమంది బఫర్‌‌ జోన్లను కూడా పట్టించుకోకుండా ఇండ్లు నిర్మించుకున్నారు. దీంతో 100 అడుగులు ఉండాల్సిన నాలాలు చాలాచోట్లా 30 నుంచి 50 అడుగులకే పరిమితం అయ్యాయి.

దీంతో 2020 ఆగస్టు రెండో వారంలో కురిసిన వర్షాలకు నగరం మొత్తం నీట మునిగింది. సిటీలోని 1,500 కాలనీల్లో సగం కాలనీలు వారం రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోవడంతో అక్కడి జనాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. దీంతో అప్పటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో కలిసి నగరంలో పర్యటించారు. అనంతరం జిల్లా స్థాయి టాస్క్‌‌ఫోర్స్‌‌ కమిటీని ఏర్పాటు చేశారు. వారు ఫీల్డ్‌‌ లెవల్‌‌లో సర్వే నిర్వహించి నాలాలపై 415 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వరద ముంపునకు ఈ ఆక్రమణలే ప్రధాన కారణమని తేల్చారు.

పట్టించుకోని గత సర్కార్‌‌

వరద ముంపునకు ఆక్రమణలే కారణమని తేల్చినప్పటికీ వాటిని తొలగించేందుకు మాత్రం గత సర్కార్‌‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్‌‌ నయీంనగర్‌‌ వద్ద ఇతర పార్టీకి చెందిన ఓ వ్యక్తి స్కూల్‌‌ బిల్డింగ్‌‌ అడ్డుగా ఉందని అప్పటికప్పుడు కూల్చేయించారు. మిగతా వాటిని కూడా కూల్చాలని చెప్పి వెళ్లిపోయారు.

దీంతో కొందరు ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లగా, మరికొంతమంది ఇండ్లను కూల్చకుండా స్థానిక నేతలే అడ్డుపడడంతో నాలా ఆక్రమణలు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత 2021, 2022, 2023లో కురిసిన వర్షాలకు కూడా నగరం నీట మునిగింది. ఇదిలా ఉంటే నాలాలు, చెరువు శిఖాల్లో ఇండ్లు కట్టుకున్న చాలా మంది ఫేక్‌‌ డాక్యుమెంట్లు సృష్టించుకున్నారని, వాటిని తొలగించలేమని, ఒకవేళ తొలగిస్తే కోర్టు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని చేతులు ఎత్తేశారు. దీంతో నాలా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అర్ధంతరంగానే ఆగిపోయింది.

ఆఫీసర్లకు ఫ్రీ హ్యాండ్​.. టార్గెట్​ నాలుగు నెలలు

జూన్‌‌ నుంచి వర్షాలు ప్రారంభం కానుండటంతో ఈ సారి ముంపు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు ప్లాన్‌‌ చేస్తున్నారు. ఈ మేరకు నయీంనగర్‌‌ నాలా డెవలప్‌‌మెంట్‌‌, రిటైనింగ్‌‌ వాల్స్‌‌ నిర్మాణానికి సుమారు రూ.90 కోట్లతో శంకుస్థాపన చేశారు. కూల్చివేతల విషయంలో ఆఫీసర్లే ఫ్రీ హ్యాండ్‌‌ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌రెడ్డి ప్రకటించారు. ఆఫీసర్లు, అన్ని పార్టీల భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు, నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని టార్గెట్‌‌ పెట్టారు. దీంతో నాలాల అభివృద్ధిపై ఆఫీసర్లు యాక్షన్‌‌ ప్లాన్‌‌ రెడీ చేశారు. ముఖ్యంగా నయీంనగర్‌‌ నాలాపైనే 300కుపైగా ఆక్రమణలు ఉండడంతో ముందుగా వాటిని తొలగించేందుకు ప్లాన్‌‌ చేస్తున్నారు. వర్షాకాలంలోగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

కూల్చలేక కుదింపు

గత పాలకులు, లీడర్ల ప్రెజర్‌‌తో అక్రమ కట్టడాలను కూల్చలేక ఆఫీసర్లు కొన్నిచోట్ల నాలా విస్తీర్ణాన్నే కుదించారు. హనుమకొండలో ప్రధానమైన నయీంనగర్ నాలా ఆక్రమణలతో 40 అడుగులకే పరిమితం అయింది. ఈ నాలాకు ఇరువైపులా కొందరు బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ఇండ్లు, అపార్ట్‌‌మెంట్లు కట్టుకున్నారు. 2023 జులైలో వచ్చిన వరదల కారణంగా ఈ నాలాను 100 అడుగులకు విస్తరించాలని అనుకున్నారు. కానీ లీడర్ల ప్రెజర్‌‌ వల్ల 82 అడుగులకే పరిమితం చేశారు.