
- ప్రభుత్వ బ్యాంకులకు ఫుల్ ప్రాఫిట్స్
- క్యూ2 లో 43 శాతం పెరిగిన కెనరా బ్యాంక్ లాభం
- తగ్గిన మొండిబాకీలు
- అదే బాటలో ఇండియన్ బ్యాంక్, పీఎన్బీ
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులకు పోటీగా లాభాలు సంపాదిస్తున్నాయి. తాజాగా కెనరా బ్యాంక్, పీఎన్బీ, ఇండియన్ బ్యాంక్‌లు తమ సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలను ప్రకటించాయి. ఈ మూడు బ్యాంకుల ఫలితాలు ఎనలిస్టుల అంచనాలను అధిగమించడంతో పాటు వీటి మొండిబాకీలు కూడా తగ్గాయి.
కెనరా బ్యాంక్..
కెనరా బ్యాంక్ అదిరిపోయే రిజల్ట్స్ ప్రకటించింది. బ్యాంక్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో రూ. 3,606 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది ఇదే క్వార్టర్లో వచ్చిన రూ.2,524 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం గ్రోత్‌కు సమానం. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. కెనరా బ్యాంక్‌కు సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 8,903 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం ఇది 20 శాతం గ్రోత్‌కు సమానం. బ్యాంక్ ప్రొవిజన్లు రూ.3,637 కోట్ల నుంచి రూ.2,608 కోట్లకు తగ్గాయి. బ్యాంక్ మొండిబాకీలు తగ్గుముఖం పట్టాయి.
కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో 6.37 శాతంగా రికార్డయిన బ్యాంక్ గ్రాస్ ఎన్పీఏల రేషియో తాజా సెప్టెంబర్ క్వార్టర్లో 4.76 శాతానికి మెరుగయ్యింది. నెట్ ఎన్పీఏల రేషియో 2.19 శాతం నుంచి 1.41 శాతానికి తగ్గింది. బ్యాంక్ డిపాజిట్లు ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసేనాటికి రూ. 11.43 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది కాలంలో బ్యాంక్ డిపాజిట్లు 8 శాతం పెరిగాయి. అలానే కెనరా బ్యాంక్ ఇచ్చిన అప్పులు తాజా సెప్టెంబర్ క్వార్టర్ నాటికి రూ.8.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. 12.59 శాతం గ్రోత్ నమోదు చేశాయి.
బ్యాంకు లోన్లలో రిటైల్ సెగ్మెంట్ వాటా పెరుగుతోంది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే తాజా క్యూ2 లో రిటైల్ లోన్లు 11 శాతం పెరిగి రూ. 1.48 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో హోమ్ లోన్ సెగ్మెంట్ వాటా 12.32 వృద్ధి చెంది రూ.88,564 కోట్లకు ఎగసింది. బ్యాంక్ అగ్రికల్చర్ సెక్టార్లో రూ.2.36 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గురువారం సెషన్లో భారీగా పడినప్పటికీ కెనరా బ్యాంక్ షేర్లు మాత్రం రెండు శాతం లాభపడి రూ.361 దగ్గర ముగిశాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నికర లాభం క్యూ2 లో రూ.1,756 కోట్లకు ఎగసింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన లాభంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ప్రొవిజన్లు తగ్గడంతో పాటు వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంక్ నికర లాభం భారీగా పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో పీఎన్బీకి రూ.411.27 కోట్ల నికర లాభం వచ్చింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.20,154 కోట్ల నుంచి రూ. 26,355 కోట్లకు చేరుకుంది. ప్రొవిజన్లు రూ.4,906 కోట్ల నుంచి రూ.3,444 కోట్లకు దిగొచ్చాయి. బ్యాంక్ గ్రాస్ ఎన్పీఏలు మొత్తం అప్పుల్లో 6.96 శాతంగా ఉన్నాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఈ నెంబర్ 10.48 శాతంగా రికార్డయ్యింది. పీఎన్బీ షేర్లు గురువారం సెషన్లో రూ.69 దగ్గర ఫ్లాట్‌గా ముగిశాయి.
ఇండియన్ బ్యాంక్..
ఇండియన్ బ్యాంక్ బంపర్ రిజల్ట్స్ ప్రకటించింది. బ్యాంక్ నికర లాభం క్యూ2 లో రూ.1,988 కోట్లకు చేరుకుంది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం ఇది 62 శాతం గ్రోత్‌కు సమానం. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఇండియన్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ రూ.1,225 కోట్లుగా ఉంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.10,710 కోట్ల నుంచి రూ.13,743 కోట్లకు ఎగసింది. గ్రాస్ ఎన్పీఏల రేషియో 7.30 శాతం నుంచి 4.97 శాతానికి మెరుగుపడింది. ఇండియన్ బ్యాంక్ షేర్లు గురువారం సెషన్లో 2 శాతం నష్టపోయి రూ.400 దగ్గర ముగిశాయి.