
- మేమేం చేయలేం.. మెడికల్ కాలేజీల స్టూడెంట్లతో మంత్రి హరీశ్
- మంత్రి హరీశ్ రావును కలిసిన స్టూడెంట్లు
- ప్రభుత్వ కాలేజీల్లో సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి
- అందుకు అవకాశం లేదన్న మంత్రి
- కోర్టుకు వెళ్లడమే మార్గమని చెప్పారంటున్న విద్యార్థులు
హైదరాబాద్, వెలుగు: అడ్మిషన్లు రద్దయిన 3 ప్రైవేటు మెడికల్ కాలేజీల సమస్య తమ పరిధిలో లేదని రాష్ట్ర సర్కారు చేతులెత్తేసింది. సంగారెడ్డిలోని ఎమ్ఎన్ఆర్, పటాన్‌చెరులోని టీఆర్ఆర్, వికారాబాద్‌లోని మహావీర్ మెడికల్ కాలేజీల స్టూడెంట్లు మంత్రి హరీశ్‌రావును మంగళవారం కలిసి తమ సమస్యను వివరించారు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లను సర్దుబాట్లు చేయాలని కోరగా, ఆ అవకాశం లేదని మంత్రి తేల్చేశారు. కేంద్రం పరిధిలో ఉండే ఎన్ఎంసీ, కాలేజీల యాజమాన్యాలు సృష్టించిన చిక్కుల పరిష్కారానికి కోర్టుకు వెళ్లడం ఒకటే మార్గంగా ఆయన వివరించినట్లు విద్యార్థులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ దొరక్కపోవడంతో ఆ 3 కాలేజీల విద్యార్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. కాలేజీలు, కాకతీయ హెల్త్ యూనివర్సిటీ ముందు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రద్దయిన కాలేజీల యాజమన్యాలు కూడా దీనిపై స్పందించడం లేదు.
అంధకారంలో 600 మంది భవిష్యత్
600 మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో ఉంటే టీఆర్ఆర్, మహవీర్, ఎమ్ఎన్ఆర్ కాలేజీల యాజమన్యాలు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కాలేజీలు నిబంధనల ప్రకారం లేనప్పుడు కౌన్సెలింగ్ జాబితాలో ఎందుకు చూపించాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇతర కాలేజీల్లో సీట్లు సర్దుబాటు చేసే ఛాన్స్ లేనందున ఆఫీసర్లు కూడా తల పట్టుకుంటున్నారు. మరోవైపు మరిన్ని ప్రైవేట్ కాలేజీలు రద్దయ్యే అవకాశం ఉన్నదంటూ ప్రచారం జరుగుతుండగా, ఆయా యాజమన్యాలకు టెన్షన్మొదలైంది.