అమెరికాలో 1500 విమాన సర్వీసులు రద్దు

అమెరికాలో 1500 విమాన సర్వీసులు రద్దు
  •     రోడ్లపై ఎక్కడికక్కడ ఆగిపోయిన వాహనాలు
  •     కాలిఫోర్నియా, అరిజోనాలో విద్యుత్  సరఫరా బంద్

వాషింగ్టన్ : గత కొద్ది నెలల క్రితం మంచుతుఫానుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అమెరికా.. మళ్లీ మంచుతుఫాను బారిన పడింది. గురువారం వివిధ రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురిసింది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు వీధులు, రోడ్లపై మంచు పేరుకుపోయింది. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. అరిజోనా నుంచి వాయోమింగ్  రాష్ట్రాల వరకు దాదాపు 320 కిలోమీటర్ల దాకా రోడ్లను బంద్  చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాల్లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో 1500 విమాన సర్వీసులను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ఐదువేల విమానాలు ఆలస్యంగా నడిచాయి.

ఇక మంచుతుఫాను కారణంగా కాలిఫోర్నియా, అరిజోనాలో విద్యుత్  సరఫరా బందయింది. రెండు రాష్ట్రాల్లో కలిపి లక్షకు పైగా జనం కరెంట్  లేకుండానే గడిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మంచుతుఫాను కురవలేదు. వచ్చే రెండు రోజుల్లో తీవ్రంగా మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్  వెదర్  సర్వీస్  బ్యూరో (ఎన్ డబ్ల్యూఎస్ బీ) అలర్ట్  జారీచేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో పది అడుగుల వరకు మంచు పేరుకుపోవచ్చని, మరికొన్ని ప్రాంతాల్లో 14 అడుగుల ఎత్తు వరకు మంచు కురవవచ్చని ఎన్ డబ్ల్యూఎస్ బీ హెచ్చరించింది. వాషింగ్టన్ లోని కోల్చక్  పర్వతంపై ట్రెక్కింగ్ కు పోయిన ముగ్గురు అవలాంచీ కారణంగా చనిపోయారు.