ప్రపంచంలో క్యాన్సర్ కేసులు..ఇండియాలోనే ఎక్కువ

ప్రపంచంలో క్యాన్సర్ కేసులు..ఇండియాలోనే ఎక్కువ
  • ఏటా పెరుగుతున్న బాధితులు
  • ‘హెల్త్ ఆఫ్ ది నేషన్’ రిపోర్టులో అపోలో హాస్పిటల్స్ వెల్లడి
  • 2020లో 14 లక్షల కేసులు.. 9.10 లక్షల మంది మృతి
  • 2025 నాటికి 15.70 లక్షలకు పెరిగే ప్రమాదం
  • మారుతున్న లైఫ్ స్టైల్, లిక్కర్, స్మోకింగ్​ కారణమని వెల్లడి

న్యూఢిల్లీ: ఇండియాలో ప్రతి ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో.. సగటున ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయని ‘హెల్త్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇటీవల రిలీజ్ చేసిన నివేదికలో అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ క్యాన్సర్‌‌ బారినపడుతున్న వారి సగటు వయసు కూడా చాలా తక్కువగా ఉండటం ఆందోళనకరమని రిపోర్టులో తెలిపింది. ఇండియా.. ‘క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా మారబోతున్నదని హెచ్చరించింది. 

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సిగరెట్, లిక్కర్, ఒబెసిటీ కారణంగానే క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయని రిపోర్టులో పేర్కొన్నది. 2020, దేశవ్యాప్తంగా 14లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9.10 లక్షల మంది చనిపోయారు. 2025 నాటికి 15.70 లక్షల వరకు క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 2022లో రెండు కోట్ల మంది క్యాన్సర్ బారినపడ్డారు. 

వీరిలో 97 లక్షల మంది చనిపోయారు. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3.50 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా డయాబెటిక్, హైపర్‌‌ టెన్షన్‌‌, మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నది. ఈ వ్యాధులను నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్​సీడీ) అంటారు. ఇండియాలో ముగ్గురిలో ఒకరు డయాబెటిక్, ముగ్గురిలో ఇద్దరు హైపర్​టెన్షన్, పది మందిలో ఒకరు డిప్రెషన్​తో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతే ఈ వ్యాధుల బారినపడ్తున్నారు.

భారీగా పెరిగిన ఎన్​సీడీ బాధితులు

గత రెండు దశాబ్దాల్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాధితులు భారీగా పెరిగారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు ప్రధాన కారణం ఈ వ్యాధులే అని నివేదిక స్పష్టం చేస్తున్నది. మహిళలు ప్రధానంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్నారు. ఇక పురుషులు.. నోటి, ఊపిరితిత్తులు, ప్రొస్ట్రేట్ క్యాన్సర్​తో బాధపడుతున్నారు. మహిళల్లో ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్తున్నారు. 

అయితే, ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. బ్రిటన్, అమెరికా, చైనా దేశాల్లో 60 నుంచి 70 ఏండ్ల వారు  క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదే ఇండియా విషయానికొస్తే.. 52 ఏండ్ల వారు బ్రెస్ట్ క్యాన్సర్, 54 ఏండ్ల వారు ఊపిరితిత్తుల క్యాన్సర్, 59 ఏండ్ల వారు గర్భాశయ క్యాన్సర్​తో బాధపడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో క్యాన్సర్‌‌ బారినపడుతున్న వారి సగటు వయసు చాలా తక్కువగా ఉండటం ఆందోళనకరమని నివేదిక తెలిపింది. అదేవిధంగా, ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటున్నది.

పెరుగుతున్న ఒబెసిటీ బాధితులు

ఇండియన్స్​లో ఒబెసిటీ, ప్రీ -డయాబెటీస్, ప్రీ -హైపర్‌‌టెన్షన్, మెంటల్ హెల్త్ డిజార్డర్స్ వంటి పరిస్థితుల కారణంగా అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతున్నాయని రిపోర్టులో వెల్లడైంది. 2016లో ఒబెసిటీ బాధితులు 9శాతం ఉంటే.. 2023 నాటికి 20 శాతానికి పెరిగారు. హైపర్ టెన్షన్ బాధితులు 2016లో 9శాతం ఉంటే.. 2023 నాటికి 13శాతం పెరిగారు. రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ.. బీపీ, బాడీ మాస్ ఇండెక్స్ స్థాయిలను నియంత్రించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాస్త బయటపడొచ్చని కూడా వెల్లడించింది.

వంధ్యత్వంతో బాధపడేవాళ్లలోనూ క్యాన్సర్ కారకాలు

వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషుల కుటుంబ సభ్యులు పెద్దపేగు, వృషణాలతో సహా కొన్ని క్యాన్సర్ల బారినపడే అవకాశాలు ఉన్నట్టు ఓ స్టడీలో తేలింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న పురుషులు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎముకలు, కీలు, మృదు కణజాలం, పెద్దపేగు, వృషణాల క్యాన్సర్​కు గురవుతారని అమెరికా హంట్స్​మన్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​లోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా బృందం తెలిపింది. వంధ్యత్వంతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లతో పాటు అత్త, మామ, బంధువుల ఆరోగ్య స్థితిగతులపై స్టడీ చేశారు. క్యాన్సర్ నిర్ధారణలో వారి పాత్రను అర్థం చేసుకోవడానికి మరింత స్టడీ చేయాల్సి ఉందని వివరించారు.

క్యాన్సర్​కు కారణాలివే..

 

  •     మారుతున్న లైఫ్ స్టైల్
  •     భారీగా పెరిగిన టొబాకో, లిక్కర్ వాడకం
  •     సిగరెట్లు, ఈ సిగరెట్లు, హుక్కా తాగడం
  •     వెహికల్స్, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న పొగ
  •     ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ తినడం
  •     లేట్ మ్యారేజెస్, గర్భం దాల్చే వయస్సు, లిక్కర్ తాగడంతో మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ 
  •     వాతావరణపరమైన మార్పులు
  •     సోషియో ఎకనామిక్ సవాళ్లు
  •     ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

 

  •     డైట్ పాటిస్తూనే.. ఎక్సర్​సైజ్​లు చేయాలి
  •     మైక్రో న్యూట్రియంట్స్, ప్రోటిన్స్, నాన్ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి
  •     నాన్ వెజ్​తో పాటు ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినొద్దు 
  •     గర్భాశయ క్యాన్సర్ నివారణకు హ్యుమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్​పీవీ), కాలేయ క్యాన్సర్ నివారణకు హెపటైటిస్ బీ వ్యాక్సిన్లు తీసుకోవాలి
  •     క్యాన్సర్ లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
  •     స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెంచాలి.