
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. ఇది నెగెటివ్ గా వాడే ఓ సామెత. ఆ నెగెటివ్ సామెత ఓ రకంగా ఒక ట్రీట్‌మెంట్‌లో పాజిటివ్ గా పనిచేసింది. కేన్సర్‌కు మందేస్తే హెచ్‌ఐవీ చచ్చిపోయింది. అవును, అది కూడా పూర్తిగా. హెచ్‌ఐవీ పేరు వింటేనే తెలియని బెరుకు. భయం. మరి హెచ్ఐవీ సోకి, కొన్నేళ్లలో చనిపోతామని తెలిసిన వారి పరిస్థితేంటి ? అలాంటి వారికి కొత్త ఆశలు పుట్టిస్తూ లండన్ కు చెందిన ఓ వ్యక్తికి హెచ్ఐవీని నయం చేశారు. ప్రపంచంలో ఇలా ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయడం ఇది రెండోసారి. పదేళ్ల క్రితం తొలిసారిగా హెచ్ఐవీని జయించిన వ్యక్తికీ కేన్సర్ ఉంది. ఆయన్ను ‘బెర్లిన్ పేషెంట్’ అని పిలవగా, ప్రస్తుత వ్యక్తిని ‘లండన్ పేషెంట్’ అని పిలుస్తున్నారు. లండన్ పేషెంట్ కు 2003లో హెచ్ఐవీ సోకింది. అప్పటి నుంచి యాంటి వైరల్ డ్రగ్స్‌తో జబ్బు తీవ్రత పెరగకుండా చూసుకుంటున్నారు. ఉన్నట్టుండి 2012లో రోగి నోటి వెంట రక్తం పడింది. వెంటనే డాక్టర్లను సంప్రదించడంతో హాడ్జ్ కిన్స్ లింఫోమా(బ్లడ్ కేన్సర్) అని తేలింది. దీంతో లండన్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ కోసం చేరారు. కొన్నాళ్ల పాటు కిమోథెరపీ చేసిన డాక్టర్లు, బోన్ మ్యారో(ఎముక మజ్జ)కు ఆపరేషన్ చేయడం ద్వారా మాత్రమే పూర్తిగా నయం చేయగలమనే అభిప్రాయానికి వచ్చారు.
హెచ్‌ఐవీని చంపే ప్రత్యేక కణం
బోన్ మ్యారో సర్జరీకి ఆరోగ్యకరమైన కొత్త కణాలు అవసరం. దీని కోసం ఓ డోనర్‌ను డాక్టర్ల టీమ్ వెతికి పట్టుకుంది. హెచ్ఐవీ వైరస్‌ను నిరోధించగలిగే ‘సీసీఆర్5’ అనే ప్రత్యేక కణం అతడి మజ్జలో ఉంది. అతడి సాయంతో లండన్ పేషెంట్‌కు డాక్టర్లు సర్జరీ చేశారు. కేన్సర్ సోకిన కణాలను తొలగించి, దాత ఇచ్చిన కణాలను పేషెంట్‌కు ఎక్కించారు. ఓ ఏడాది పాటు కేన్సర్‌తోపాటు హెచ్ఐవీకీ మందులు కొనసాగించారు. తర్వాత హెచ్ఐవీకి మందులు ఆపారు.
హెచ్ఐవీకి మందులు వాడకపోతే?
ఎముక మజ్జలో ఉండే రోగ నిరోధక కణాలకు హెచ్ఐవీ సోకుతుంది. ఒకసారి జబ్బును గుర్తించాక, వైరస్ పెరగకుండా అడ్డుకునేందుకు యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారు. ఈ మందులు ఆపితే వైరస్ దాడి పెరిగి, పేషెంట్ చనిపోవచ్చు. కానీ 18 నెలలుగా మందులేసుకోకపోయినా లండన్ పేషెంట్‌కు ఎలాంటి హాని కలగలేదు. ఈ టైంలో ప్రతిరోజూ హెచ్ఐవీ వైరస్ జాడ కోసం ఆయనకు డాక్టర్లు టెస్టులు చేశారు. కానీ వైరస్ జాడ కనిపించలేదు. దీంతో అతను హెచ్ఐవీ నుంచి ఉపశమనం పొందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే హెచ్‌ఐవీ నుంచి పూర్తిగా బయటపడినట్లే అని చెప్పడం కూడా సరి కాదన్నారు. మరో 18 నెలల పాటు వైరస్ కోసం టెస్టులు చేస్తూనే ఉంటామన్నారు.హెచ్ఐవీని నయంచేయడం కోసం ‘జీన్ థెరపీ’ అనే టెక్నాలజీపై ప్రస్తుతం బాగా రీసెర్చ్ జరుగుతోంది. దీనిలో కూడా ‘సీసీఆర్5’దే కీలకపాత్ర. ఇటీవల చైనా సైంటిస్టు జీన్ ఎడిటెడ్ బేబీలను సృష్టించిన సంగతి తెలిసిందే. బిడ్డ తల్లి గర్భంలో ఉండగా ఆయన జీన్ ఎడిట్ టూల్ సీఆర్ఐఎస్ పీఆర్ సాయంతో సీసీఆర్5 ను చొప్పించారు.
అందరికీ ఈ ట్రీట్ మెంట్ పనికొస్తుందా ?
హెచ్ఐవీ ఉండి, కేన్సర్ లేని వ్యక్ తులకు ఈ ట్రీట్ మెంట్ చేయడం కుదరదు. అలా అని కేన్సర్, హెచ్ఐవీ ఉన్న ప్రతి ఒక్కరికీ బోన్ మ్యారో ఆపరేషన్ చేయరు. అరుదైన సందర్భాల్లో మాత్రమే చేస్తారు. ఆపరేషన్ చేసే టైంలో పేషెంట్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుండటమే ఇందుకు కారణం. బెర్జిన్ పేషెంట్ కు ఈ సర్జరీ చేసేప్పుడు డాక్టర్లు చాలా టెన్షన్ పడ్డారు. అతను అప్పటి కే కేన్సర్ తగ్గడానికి రేడియోథెరపీ తీసుకున్నాడు. ఈ ట్రీట్ మెంట్ తీసుకున్న వాళ్లకు బోన్ మ్యారో సర్జరీ చేయడం పెద్ద సవాలే. కేవలం 50 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉంటాయి. లండన్ పేషెంట్ విషయంలో ఇలాంటి దేమీ జరగలేదు. అతడికి10 నుం చి 20 శాతం మాత్రమే రిస్క్ ఉంటుందని సర్జరీకి ముందు డాక్టర్లు చెప్ పారు. ఈ కేసును లండన్ లోని యూనివర్సిటీ కాలేజ్, ఇంపీరియల్ కాలేజ్, కేం బ్రిడ్జ్ , ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల రీసెర్చర్లు అధ్యయనం చేశారు.