కొత్త ఓటర్లు ఎటువైపో?  ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు అష్టకష్టాలు

కొత్త ఓటర్లు ఎటువైపో?  ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు అష్టకష్టాలు

హైదరాబాద్,వెలుగు:   అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటర్ల జాబితా సవరణ అనంతరం గ్రేటర్​పరిధిలో కొత్త అన్ని నియోజకవర్గాల్లోనూ పెరిగారు. అయితే కొన్ని చోట్ల పాత ఓటర్లకు సమానంగా కొత్తగా చేరడం గమనార్హం. ఈసారి దాదాపు కొత్త ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలో కొత్త ఓటర్లే కీలకంగా మారనున్నారు. వారు ఎటు వైపు మొగ్గుచూపుతారోనని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు.  

ఇండ్లకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటూ.. 

ఈసారి ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కును పొందిన వారే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. గ్రేటర్​పరిధిలోని 24 స్థానాల్లో కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 40 వేల నుంచి దాదాపు 3.5 లక్షల వరకూ కొత్తగా నమోదయ్యారు. ఈ స్థాయిలో కొత్త ఓటర్లు పెరగడంతో అధికార బీఆర్ఎస్​ కంటే కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు ఎక్కువ సంతోషంతో ఉన్నారు. పాత ఓటర్లంటే గతంలో ఒక పార్టీని గెలిపించిన వారే.

కానీ కొత్తగా ఓటు హక్కు పొందిన వారు మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో అత్యధికం గా ప్రతి పక్ష పార్టీలకే పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆయా నియోజక వర్గాల్లో కొందరు అభ్యర్థులు ముందు జాగ్రత్తగానే కొత్త ఓటర్ల జాబితా రావడంతోనే వారి ఇండ్లకు వెళ్లి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కొత్త ఓటర్లలో అధికశాతం మంది యువత ఉండడం, వారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనేది ఆసక్తిగా మారింది. యువత కాంగ్రెస్ ​లేదా బీజేపీ వైపు మొగ్గితే  బీఆర్​ఎస్ ​ఓటమి చర్చ జరుగుతుంది. సంక్షేమ పథకాల పేరుతో బీఆర్ఎస్​ వైపు ఆసక్తి చూపితే.. కాంగ్రెస్​, బీజేపీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది.