టిక్కెట్లు కన్ఫర్మ్ కాకున్నా జనాల్లోకి అభ్యర్థులు

టిక్కెట్లు కన్ఫర్మ్  కాకున్నా జనాల్లోకి అభ్యర్థులు
  • ఎక్కడచూసినా ఫ్లెక్సీలతో నింపేస్తున్నరు
  • గుళ్ల వద్ద కూడా బ్యానర్ల ఏర్పాటు
  • మూడు నెలల ముందుగానే క్యాంపెయినింగ్

వరంగల్‍, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్  ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి అన్ని పార్టీల్లో హడావుడి నెలకొంది. ముఖ్యంగా అభ్యర్థుల మధ్య టికెట్ల వార్‍  నడుస్తోంది. గతంలో తెలంగాణ సెంటిమెంట్‍ ఉండటంతో అధికార బీఆర్‍ఎస్‍  టికెట్‍ దక్కించుకున్న వారే మళ్లీ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతారన్న నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం కేసీఆర్‍  ప్రభుత్వానికి మరో మూడు నెలల గడువు ఉండగానే నియోజకవర్గాల్లో ఎలక్షన్‍  మూడ్‍  వచ్చేసింది. గోడలన్నీ పొలిటికల్‍  లీడర్ల ఫొటోలు, పార్టీ గుర్తులతో కలర్‍ఫుల్‍గా మారుతున్నాయి.

Also Rard: అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం

డోర్‍  స్టిక్కర్లు, ఆటోలపై పోస్టర్లు, పండుగల శుభకాంక్షలు, లీడర్ల ఫ్లెక్సీలతో ఎక్కడా చూసినా రేపో ఎల్లుండో ఎన్నికలు ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి అధికార బీఆర్‍ఎస్‍తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‍, బీజేపీ వంటి ప్రధాన పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. పోటాపోటీగా ఎత్తుగడలు వేస్తున్నారు. బీఆర్‍ఎస్‍  115 మందితో మెజారిటీ సిట్టింగ్‍ ఎమ్మెల్యేలతో ఇప్పటికే క్యాండిడేట్ల జాబితాను ప్రకటించింది.  జనాల్లోకి వెళ్లి పనిచేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీచేసింది.అయితే, చాలా చోట్ల  సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనిని అనుకూలంగా మలచుకునేందుకు ప్రతిపక్ష లీడర్లు ప్లాన్‍  చేస్తున్నారు. గట్టి లీడర్లకు సీట్లు కేటాయించేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు. అప్పటి వరకు ప్రధాన అభ్యర్థులుగా భావించే వారిని జనాల్లో ఉండాలని చెబుతున్నారు. దీంతో టికెట్లు కన్‍ఫర్మ్  అవక ముందే ఎన్నికల ప్రచారం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రచారానికి ఇప్పటికే రూ.కోట్లు ఖర్చు

ప్రధాన పార్టీల నుంచి ఈసారి ఎమ్మెల్యే పదవికి బరిలో ఉంటామని నమ్మకంగా ఉన్న లీడర్లు.. తమకు టిక్కెట్‍  ఖరారు కాకముందే ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. మామూలుగా ఎన్నికల నోటిఫికేషన్‍  వచ్చాక మొదలుపెట్టాల్సిన ప్రచారాన్ని మూడు నెలల ముందుగానే షురూ చేశారు. బీఆర్‍ఎస్‍లో టికెట్ల జాబితాలో ఉన్నవారు.. కాంగ్రెస్‍, బీజేపీలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రధాన లీడర్లు ఇప్పటికే ప్రచారం ప్రారంభించి జనాల మధ్య తిరుగుతున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసి నియోజకవర్గ పరిధిలో ఎక్కడ గోడ కనిపిస్తే అక్కడ పెయింటింగ్‍ లు రాయిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసీ డిజిటల్‍ వాల్‍ పోస్టర్లు కొట్టించి గల్లీగల్లీలో అతికిస్తున్నారు. ఊరంతా తిరిగే ఆటోలకు డబ్బులు ఇచ్చిమరీ కలర్‍ఫుల్  పోస్టర్లు పెట్టిస్తున్నారు. తెల్లారగానే అభ్యర్థి ముఖం, వారి పార్టీ గుర్తు కనిపించేలా ఇంటింటికీ డోర్‍  స్టిక్కర్లు అతికించారు. పండుగల వాతావరణం ఉండడంతో శుభాకాంక్షల పేరుతో గుళ్లు, గోపురాల వద్ద కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేయిస్తున్నారు. అప్పట్లో లీడర్ల మెడల్లో మాత్రమే కండువాలు ఉండగా.. ఇప్పుడు ప్రతి కార్యకర్త వాటిని వేసుకునేలా కండువాలు, టోపీలు తెప్పించారు. సభలు, సమావేశాలు పెట్టి భోజనాలు, డిన్నర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా మూడు నెలల ముందే అన్ని పార్టీల లీడర్లు రూ.కోట్లు ఖర్చుచేసి ప్రచారానికి తెరతీశారు.