ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని అనుమతించని అధికారులు

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని అనుమతించని అధికారులు

గ్రూప్ 1 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఉదయం 10.15 గంటల తర్వాత వచ్చే వారిని పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్పీ ప్రకటించింది. దీంతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి రానివ్వడం లేదు. నిజాం కాలేజీ సెంటర్ గేట్లను ఉదయం 10.15గంటలకు అధికారులు మూసివేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఎగ్జామ్ రాసేందుకు బెంగళూరు నుంచి వచ్చామని పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించినా లోపలికి పంపలేదు.

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ లోని టీకేఆర్ కాలేజీలో గ్రూప్ 1 ఎగ్జామ్ కు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. లేటుగా వచ్చిన అభ్యర్థుల్లో కందుకూరు అనలిటికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఇక సిల్వర్ డ్రాప్ హై స్కూల్ సెంటర్ వద్ద ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో పోలీసులు వారిని వెనక్కి పంపారు. మరోవైపు హయత్ నగర్ గవర్నమెంట్ స్కూల్ వద్ద కూడా ఓ మహిళా అభ్యర్థి ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అశోక్ నగర్ నుంచి వచ్చిన సదరు అభ్యర్థి స్కూల్ అడ్రస్ దొరకకపోవడంతో ఆలస్యమైనట్లు చెప్పింది. అయినా సమయం దాటిపోయిందంటూ పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.

మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని కే ఆర్ కే కళాశాలలో గ్రూప్ 1 పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపారు. సమయం మించి పోవడంతో పోలీసులు కాలేజ్ గేటుకు తాళం వేశారు. దీంతో మేడ్చల్, లాల్ బజార్ నుంచి వచ్చిన ఇద్దరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు.