
- గుడిసెలు పీకేసి రోడ్డున పడేశారంటున్న బాధితులు
- ప్రచారానికి వచ్చే వారిని ప్రశ్నిస్తూ నిలదీస్తున్నరు
- గులాబీ పార్టీ నేతలకు ఎదురైతున్న ఇబ్బందులు
సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలో అధికార పార్టీ అభ్యర్థులకు బస్తీ జనాల నుంచి కొత్త సమస్య ఎదురవుతుంది. డబుల్ఇండ్లు ఇస్తామని చెప్పి తమ గుడిసెలు పీకేశారని, ఇండ్లిచ్చి తాళాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారంటూ ప్రచారానికి వెళ్లిన నేతలను స్థానికులు నిలదీస్తున్నారు. ఉన్న గుడిసెలు పీకేసి రోడ్డుపాలు చేసిన నేతలను ప్రచారానికి రానియ్యమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రచారం చేస్తుకుంటున్న అధికార పార్టీ అభ్యర్థులకు ఇలాంటి నిరసన సెగలు తగులుతున్నాయి.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు హడావిడిగా డబుల్ఇండ్ల పంపిణీ ప్రారంభించారు. సిటీ శివారులో పలు ప్రాంతాల్లో నిర్మించినవి ఏరియా, ప్రాంతంతో సంబంధం లేకుండా లక్కీ డ్రాలు తీసి ఇండ్లను కేటాయించారు. అసలైన లబ్ధిదారులకు అందలేదనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇండ్ల పట్టాలు మాత్రమే ఇచ్చి తాళాలు ఇవ్వలేదు. దీంతో తమకు ఇంటి తాళాలు ఎప్పుడు ఇస్తారని..? అసలు ఇస్తారా..? ఇవ్వరా..? అని పలు బస్తీల వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికార పార్టీకి ఆశించినస్థాయిలో ప్రచారం కలిసి వస్తుందా..? లేదా..? అనే ఆందోళనలో నేతలు ఉన్నారు.
ఇంటి తాళాలు ఇవ్వకపోగా..
ఎన్నికల వేళ అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు ర్యాలీలు, బస్తీల్లో గ్రూపుల వారీగా, డివిజన్ల వారీగా మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అక్కడ అధికార పార్టీకి చెందిన కొందరు బస్తీ నేతలు సైతం నేతలను ప్రశ్నిస్తున్నారు. డబుల్ ఇండ్లు చాలా వరకు గులాబీ నేతలు, అనుచరులు, కుటుంబ సభ్యులతో పాటు సానుభూతి పరులకే దక్కాయని, ఇండ్లు లేని నిరుపేదలకు మొండిచేయి చూపారని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. తమకు ఇంటి పట్టాలు ఇచ్చినంత మాత్రాన సొంతమెలా అవుతాయని, తాళాలు ఇస్తేనే కదా అవి మా సొంతం.. ? అనే ఫీలింగ్ వస్తుందంటున్నారు.
ఉన్న ప్రాంతం విడిచి వెళ్లలేక..
సిటీలో చాలా ప్రాంతాల్లో డబుల్ఇండ్లను నిర్మించిన ఏరియాలోని వారికే కేటాయిస్తామని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రజల నుంచి సానుభూతి, ఓట్లు పొందాలని హడావిడిగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వాటిని సిటీ శివారు బయట చాలా దూరాన ఇచ్చి గందరగోళ పరిస్థితులు కల్పించారు. దీంతో ప్రజలకు సొంతింటి కల నిజమైనప్పటికీ తామున్న చోటును వదలలేక, ప్రభుత్వం కేటాయించిన ఇండ్లకు వెళ్లలేక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇండ్లు ఇస్తేనే ఓట్లు వేస్తాం
సిటీలో ఓ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి డబుల్ ఇండ్లు ఇస్తామని, పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్న స్థలాన్ని ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు వారికి ఇండ్లు కేటాయించలేదు. ఖాళీ చేయించిన స్థలంలో కొత్తగా ఇండ్లు కట్టించలేదు. డబుల్ఇండ్ల ఆశచూపి ఉన్న గుడిసెలు పీకేశారు. దీంతో ఇండ్లు రాక, ఉన్న గుడిసెలు పోయి తామంతా రోడ్డున పడ్డామని బస్తీవాసులు వాపోతున్నారు.
పట్టాలు ఇచ్చిన ఇండ్లకు ఇంకా తాళాలు ఇవ్వకపోతుండగా వేలకు వేలు అద్దెలు కట్టలేక పోతున్నామంటున్నారు. అయితే.. నేతలు బస్తీ వాసులను నచ్చ జెపుతూ.. ఇప్పటికే 53వేల మందికి ఇచ్చామని, ఇంకా మరో 30వేలు సిద్ధంగా ఉన్నాయని, ఎన్నికల తర్వాత కేటాయిస్తామని, బీఆర్ఎస్ కు ఓటు వేయాలని స్థానిక నేతలు బస్తీవాసులకు హామీలు ఇస్తున్నారు. దీంతో ఇప్పటికే నాలుగైదు సార్లు గెలిచిన నేతలు హామీలు ఇచ్చి మరిచారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలను బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ విధంగా నమ్మించి వారి భరోసాను పొందుతారో వేచి చూడాల్సిందే.