కిరాణా షాపులో గంజాయి చాక్లెట్స్.. జగద్గిరిగుట్టలో 2 లక్షల విలువైన సరుకు సీజ్

కిరాణా షాపులో గంజాయి చాక్లెట్స్.. జగద్గిరిగుట్టలో 2 లక్షల విలువైన సరుకు సీజ్

హైదరాబాద్​ జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా షాపులోంచి పోలీసులు 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్స్, 4 కిలోల ఎండు గంజాయి పౌడర్​ను స్వాధీనం చేసుకున్నారు.

జీడిమెట్ల, వెలుగు: గంజాయి చాక్లెట్స్​ విక్రయిస్తున్న ఓ కిరాణ దుకాణంపై మాదాపూర్​ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు దాడిచేశారు. షాపులో నుంచి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్స్​, గంజాయి పౌడర్​ను పట్టుకున్నారు. పశ్చిమ్​ బెంగాల్ , కోల్​కత్తాలోని అసాన్​సోల్​గ్రామానికి చెందిన మనోజ్​కుమార్​అగర్వాల్​ (54) హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట అంజయ్యనగర్​లో  కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం మాటున పశ్చిమ బెంగాల్​ నుంచి గంజాయి చాక్లెట్స్​, గంజాయి తెచ్చి విక్రయిస్తున్నాడు. 

విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్​ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు దాడులు చేశారు. ఈదాడుల్లో  దుకాణంలో ఉన్న 26 కిలోల 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్స్​, 4 కిలోల ఎండు గంజాయి పౌడర్​ను స్వాధీనం చేసుకున్నారు.  మనోజ్​కుమార్​ను అరెస్ట్​చేశారు. విచారణలో గంజాయి చాక్లెట్స్, గంజాయిని కోల్​కత్తాలోని మోహన్​ అనే వ్యక్తి నుంచి తరచూ కొనుగోలు చేసి తెచ్చి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.  స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2.66 లక్షలు ఉంటుందని..ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రధాన సరఫరాదారుడు మోహన్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

పీడీఎస్​ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్​ బియ్యాన్ని బాలానగర్​ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు.  సుభాశ్​​నగర్​కి చెందిన సంగిశెట్టి వెంకటేశ్వర్లు (52) పీడీఎస్​​ బియ్యాన్ని విక్రయిస్తున్నాడు. బాలానగర్​ ఎస్వోటీ , జీడిమెట్ల పోలీసులు దాడి చేసి, 3,800కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.