
- ఊరూరా యాత్రలతో గులాబీ పార్టీ గెలుపులో కీలకం
- ఈసారి మద్దతు తెలపని విద్యార్థి జేఏసీ
- నిరుద్యోగులకు, స్టూడెంట్లకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశాడని ఆగ్రహం
- సొంత పార్టీపై టీఆర్ఎస్వీ ఉద్యమ నేతల అసంతృప్తి
వరంగల్, వెలుగు : కొత్త రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‍ఎస్ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ ఈసారి సైలెంట్‍గా ఉంది. గతంలో ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కాగానే ఒక్కో నియోజకవర్గంలో వందల మంది స్టూడెంట్లతో యాత్రలు చేపట్టిన జేఏసీ.. ఇప్పుడు సగం ప్రచారం ముగిసినా అధికార పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు వెళ్లలేదు.
కేసీఆర్ సర్కారు రెండు టర్ములు అధికారంలో ఉన్నా నిరుద్యోగులకు, స్టూడెంట్లకు అన్యాయం చేశారనే భావనతోనే వారంతా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. నాడు ఉద్యమకారులుగా తెగించి కొట్లాడిన విద్యార్థి నేతలంతా తెలంగాణ వచ్చాక బీఆర్‍ఎస్ స్టూడెంట్ అనుబంధ సంస్థ టీఆర్‍ఎస్ వీలో చేరారు. అయితే టీఆర్ఎస్ వీ నేతలు కూడా ప్రభుత్వ, పార్టీ పెద్దలపై కోపంగా ఉన్నారు. పార్టీ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేయూ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఇప్పటికే పలుమార్లు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేశారు. సీనియర్ ఉద్యమకారులుగా గతంలో మాదిరి ఇప్పుడు అధికార పార్టీ తరపున ప్రచారంలో ముందుండి నడవడం లేదు.
2014, 2018 ఎన్నికల్లో కేయూ జేఏసీ మార్క్
తెలంగాణ ఉద్యమంలో ఐక్యంగా కొట్లాడాలనే ఉద్దేశంతో నాటి కేయూ స్టూడెంట్లు యూనియన్లకు అతీతంగా 2009లో రాష్ట్రంలోనే మొట్టమొదట జేఏసీ ఏర్పడ్డారు. ఆ తర్వాత ఇతర యూనివర్సిటీల్లో కమిటీలు వచ్చాయి. బీఆర్‍ఎస్ నేతలు పోరాటం చేసే క్రమంలో కేయూ జేఏసీ బృందం అప్పటి లీడర్లకు వెన్నెముకగా నిలిచింది. పార్టీ తరఫున ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా జేఏసీ నేతలు విజయవంతం చేశారు. 2009 నవంబర్ 23న 50 వేల మందితో కేయూలో సభ నిర్వహించి కేసీఆర్‍ను పిలిచారు.
అనంతరం రాష్ట్రం ఏర్పడ్డాక కూడా జేఏసీ.. బీఆర్‍ఎస్‍తోనే నడిచింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేయూ జేఏసీ నేతలు ఉమ్మడి వరంగల్‍తో పాటు చుట్టుపక్క జిల్లాల్లో బీఆర్‍ఎస్ అభ్యర్థుల ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఊరూరా వందల మంది స్టూడెంట్లు బస్సుయాత్రలు, పాదయాత్రలు చేసి గడపగడపకు తిరిగి బీఆర్ఎస్ తరపున ప్రచారం చేసి క్యాండిడేట్లను భారీ మెజారిటీతో గెలిపించారు.
నిరుద్యోగ సమస్యపై కేయూ జేఏసీ ఫైర్
నాడు వెంటనడిచి బీఆర్‍ఎస్ అభ్యర్థులను గెలిపించిన కేయూ జేఏసీ ఇప్పుడు అదే కేసీఆర్ సర్కారు తీరుపై గుర్రుగా ఉంది. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తే.. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తీవ్ర అన్యాయమే జరిగిందని ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లు వేయకపోవడం, వేసిన దాంట్లో అవినీతి అక్రమాలు, పేపర్ లీకేజీలతో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేశారని మండిపడుతున్నారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలను కావాలనే సొంత పార్టీ నేతల ప్రైవేట్ యూనివర్సిటీలకు ధారాదత్తం చేస్తున్నారని పోరాటాలకు దిగారు.
పీహెచ్‍డీ అక్రమాలపై లాఠీచార్జీతో మరింత గ్యాప్
కేయూ పీహెచ్‍డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటూ కేయూ జేఏసీ ఆధ్వర్యంలో రోజుల తరబడి స్టూడెంట్లు ధర్నాలు చేశారు. అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. స్పందన లేకపోవడంతో నిరసనలకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడంతో పలువురు స్టూడెంట్లు, జేఏసీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. బాధితుల తరఫున జేఏసీ నేతలు మళ్లీ పోరాటాలు నిర్వహించారు. ఈ క్రమంలో వరంగల్ పర్యటనకు వచ్చిన కేటీఆర్.. స్టూడెంట్లకు సారీ చెప్పారు. పీహెచ్ డీ అక్రమాలపై ఎంక్వయిరీ చేసి వారంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.
రోడ్డెక్కిన సొంత పార్టీ స్టూడెంట్ నేతలు
అధికార పార్టీ తీరుపై కేయూ జేఏసీని వివిధ స్టూడెంట్ యూనియన్లే కాకుండా పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ టీఆర్‍ఎస్ వీ సీనియర్ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారు. కేయూ ఉద్యమకారులకు బాధ్యతలు, పదవులు అప్పజెప్పడంలో పూర్తిగా అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ సేవలను వాడుకున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల తీరు వల్లే తమను ప్రభుత్వ పెద్దలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
తమను గుర్తించకుంటే నవంబర్ 23న కాకతీయ యూనివర్సిటీలో మరో సభ నిర్వహిస్తామని అక్టోబర్ లో కేయూలో ప్రెస్‍మీట్ పెట్టి హెచ్చరించారు. నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించి నిరుద్యోగులు, స్టూడెంట్లకు జరిగిన అన్యాయాలను వివరించి తమ సత్తా చూపుతామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఫలితాలను ప్రభావితం చేసే కేయూ జేఏసీ మద్దతు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి, అభ్యర్థులకు ఉంటుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.