పాలనకు ఇబ్బంది.. నేను రాలేను ప్లీజ్

పాలనకు ఇబ్బంది.. నేను రాలేను ప్లీజ్

సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ నిమిత్తం వారానికి 5 రోజులు కోర్టుకు హాజరైనట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. రోజువారీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకూ ఆటంకమన్నారు. హాజరు మినహాయింపుపై వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో జగన్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... 'పాలనా పనులతో పాటు ప్రొటోకాల్‌ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

సీఎం హోదాలో ఉన్న ఆయనను కలవడానికి పలువురు కోర్టుకు ఎక్కువగా వస్తారు. దీనివల్ల అందరికీ ఇబ్బందులే. ఈ కేసుల్లో ఇతర నిందితుల కారణంగా విచారణలో స్టే వచ్చింది. పిటిషనర్‌ ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు పొందలేదు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి వారం హాజరయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో 11 కేసులున్నాయి. వీటిలో కొన్ని 2జీ కేసు కన్నా 5 రెట్లు సంక్లిష్టమైనవి. అందువల్ల విచారణకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిసారి హాజరుకావడం సాధ్యం కాదు. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి...' అని పేర్కొన్నారు.

సత్యం రామలింగరాజు కేసులో ఒక జడ్జిని పూర్తిగా కేటాయించి 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రెండేళ్లకుపైగా పట్టిందని ఆయన ఉదహరించారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుపై ఉన్న కేసులో ఎన్నిసార్లు హాజరయ్యారని ఆరా తీశారు. బీహార్‌ వంటి రాష్ట్రాల్లో నిందితులు హాజరైతే సాక్షులు మాట్లాడటానికి భయపడుతుంటారని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు లేవనుకుంటానని వ్యాఖ్యానించారు. సీబీఐ వాదనల నిమిత్తం విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు.