కేటీపీపీలో ఇంటి దొంగలు .. సెక్యూరిటీ కళ్లు కప్పి అందిన కాడికి దోచేస్తున్నారు

కేటీపీపీలో ఇంటి దొంగలు .. సెక్యూరిటీ కళ్లు కప్పి అందిన కాడికి దోచేస్తున్నారు
  • ఇటీవల రూ. లక్షల విలువైన కాపర్​వైర్ చోరీ 
  • ఘటనలపై నిర్లక్ష్యంగా ఉంటున్న అధికారులు   
  • 3 నెలల్లో నలుగురు ఆర్టిజిన్లపై సస్పెన్షన్ ​వేటు
  • ప్లాంటు సెక్యూరిటీ వింగ్ లో కొరవడిన నిఘా  
  • వరుస చోరీలతో అందినకాడికి మాయం 
  • ఐదు నెలల కింద క్వార్టర్స్ లోంచి ఎత్తుకెళ్లిన సొత్తు  

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు : కాకతీయ థర్మల్ పవర్​ప్రాజెక్టు(కేటీపీపీ)లో ఇంటి దొంగల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సెక్యూరిటీ కళ్లు కప్పి అందిన కాడికి దోచేస్తున్నారు. రూ. లక్షల విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. కొన్నాళ్లుగా చోరీలు జరుగుతుండగా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గత సమ్మర్ లో  కేటీపీపీ ఏరియాలో కార్మికుల క్వార్టర్స్ లోని 7 ఇండ్లలో ఒకేసారి చోరీలు జరిగాయి. 

ఓ ఏడీ ఆఫీసర్ ఇంట్లో రూ. 2 లక్షల సొత్తు,  మిగతా ఇండ్లలోనూ విలువైన సొమ్ములను ఎత్తుకెళ్లారు.  ఇటీవల రూ. లక్షల విలువైన కాపర్​వైర్​మాయమైన ఘటన ఆలస్యంగా తెలియడంతో చర్చనీయాంశమైంది. ఇంటి దొంగల సపోర్ట్ లేకుండా బయటి వ్యక్తులు కేటీపీపీలోకి వచ్చే చాన్స్ లేదు. చోరీల వెనక ఇంటి దొంగల హస్తం తప్పక ఉంటుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఘటనలపై నిర్లక్ష్యంగా ఉంటున్న అధికారుల తీరును విమర్శిస్తున్నారు.  

పూర్తిస్థాయి నిఘా లేకపోగా.. 

జయశంకర్​భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్​వద్ద కాకతీయ థర్మల్​పవర్​ప్రాజెక్టు(కేటీపీపీ)ను 1100 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ప్లాంటు ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపి సుమారు 2 వేల మందికిపైగా విధులు నిర్వహిస్తుంటారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిఘా లేకపోవడంతో  దొంగలు లోపలికి వెళ్లి విలువైన వస్తువులను మాయం చేస్తున్నారని కార్మికులు పేర్కొంటున్నారు. 

బయటకు ఏయే వస్తువులు పోతున్నాయో తెలుసుకోకుండా ఉన్నతాధికారులకు నిర్లక్ష్యంగా ఉంటున్నాని విమర్శిస్తున్నారు. రెండేండ్ల కింద స్టోర్​రూమ్ లో నిల్వ చేసిన రూ. కోట్ల విలువైన సామగ్రిని ఇంటి దొంగలు మాయం చేశారు. కాగా.. ఐదు నెలల కింద కొంపెల్లి శివారు వైపు నుంచి ప్లాంట్ కాంపౌండ్ వాల్వ్ కు చీరలు కట్టుకుని లోపలికి వచ్చారు. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు.  క్వార్టర్స్ కు చెందిన కొందరి సపోర్ట్ లేకుండా వచ్చేందుకు వీలు లేదు. ఇటీవల ప్లాంటులో రూ. లక్షల విలువైన కాపర్​వైర్ మాయమైన ఘటనను ఆలస్యంగా అధికారులు గుర్తించారు. 

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంటి దొంగల పనిగా తేల్చారు. 3 నెలల కింద ఇద్దరు, తాజాగా మరో ఇద్దరు ఆర్టిజన్లపై సస్పెన్షన్​వేటు వేశారు.  భారీ వస్తువుల మాయంపై కొందరు ఆఫీసర్లను బాధ్యులుగా గుర్తించి బదిలీలు చేశారు. అయినా ప్రాజెక్టులో చోరీలు ఆగడం లేదు. బయటపడ్డవి కొన్నే అయినా ఇంకా బయటకు రానివి చాలానే ఉంటాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

ఘటనలపై లేటుగా మేల్కొంటున్న ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదులు చేసి చేతులు దులుపు కుంటున్నారే తప్ప సీరియస్​యాక్షన్​ తీసుకోవడంలేదనే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన ఆర్టిజన్​ ఓ ఆఫీసర్​తో దురుసుగా ప్రవర్తించడంతో పాటు ప్లాంటులో మాయమైన కాపర్​వైర్ కు బాధ్యుడిగా చేస్తూ అతనిపై సస్పెన్షన్​వేటు వేసినట్టు కార్మికుల్లో చర్చ జరుగుతోంది.

ప్లాంట్ ఇంజనీరే ఇన్ చార్జ్ ఎస్​వో.. 

 పోలీస్​శాఖ నుంచి డీఎస్పీ క్యాడర్​ఆఫీసర్​ఎస్​వో(సెక్యూరిటీ ఆఫీసర్)గా విజిలెన్స్,సెక్యూరిటీ విభాగాలతో నిఘా ఉంటుంది. ప్రధానంగా ప్లాంటు తొలి, రెండో గేట్ల వద్ద ఉన్న నిఘా పూర్తిస్థాయిలో లేకపోవడాన్ని గుర్తించిన కొందరు విలువైన వస్తువులను, కాపర్​వైర్​ను కాంపౌండ్ వాల్​  మీదుగా బయటకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దుబ్బపల్లి వైపు నుంచి ప్లాంట్ ను ఆనుకుని ఉన్న చెరువు దగ్గర నుంచి లోపలికి వస్తున్నారనే టాక్​ఉంది. 

కాగా.. ఏడాదిగా సెక్యూరిటీ ఆఫీసర్(ఎస్​వో) లేకపోవడంతో ప్లాంట్ ఇంజనీరే ఇన్ చార్జ్ గా ఉన్నారు. దీంతో ప్లాంటులోని అన్ని పనులను పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోతున్నారని కార్మికులు పేర్కొంటున్నానరు. నిఘా వ్యవస్థను కమాండ్​చేయలేక పోవడం,  ప్లాంటుకు కీలకమైన సెక్యూరిటీ వింగ్ లో శాఖకు సంబంధంలేని ఇంజనీర్​పెత్తనం చేస్తుండడంతోనే వరుస చోరీలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ముందస్తు వ్యూహంతో నిఘా పెట్టలేకపోతున్నారంటున్నారు. 

100మందికి పైగా సెక్యూరిటీ ఉండాల్సి ఉండగా, కేవలం70 మందే డ్యూటీలో ఉంటున్నారు. ఇందులో 10 మంది తాడిచర్ల కోల్ చెక్​పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. మిగతా 60 మందితోనే నిఘా కొనసాగిస్తున్నారు. రాత్రిపూట సెక్యూరిటీ నిఘా సరిగా లేకపోవడంతోనే  చోరీ ఘటనలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పటిష్ట నిఘాను పెంచి ఇంటి దొంగలను పట్టాలని, డీఎస్పీ క్యాడర్ ఆఫీసర్ ను వెంటనే నియమించి పటిష్ట బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.