రూ.6,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్‌‌

రూ.6,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో క్యాపిటల్యాండ్‌‌ రూ.6,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. మంగళవారం సిటీలో మంత్రి కేటీఆర్‌‌ సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సర్కార్​తో ఎంవోయూ చేసుకున్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్‌‌ ఏర్పాటుతో పాటు హైదరాబాద్‌‌లో తమ కంపెనీ కార్యకలాపాలు విస్తరిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మదాపూర్‌‌లోని ఇంటర్నేషనల్‌‌ టెక్‌‌ పార్క్‌‌ లో రూ.1,200 కోట్లతో క్యాపిటల్యాండ్‌‌ ఇండియా ట్రస్ట్‌‌ 2.50 లక్షల స్క్వేర్‌‌ ఫీట్ల విస్తీర్ణంలో డేటా సెంటర్‌‌ ఏర్పాటు చేస్తుంది. 

ఐదేండ్ల తర్వాత ఇంకో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఆఫీస్‌‌ స్పేస్‌‌, డేటా సెంటర్‌‌ ను విస్తరిస్తారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్‌‌ మార్కెట్లలో హైదరాబాద్‌‌ ఒకటని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. క్యాపిటల్యాండ్‌‌ ఇక్కడ సెంటర్‌‌ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌‌లో ఐటీ ఇండస్ట్రీ అవసరాలు తీరుతాయన్నారు. ఐటీ, ఐటీఈఎస్‌‌ ప్రాజెక్టుల్లో ఈ సంస్థతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.