టీ20 వరల్డ్‌ కప్‌లో తడబడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

టీ20 వరల్డ్‌ కప్‌లో తడబడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌) టీ 20 వరల్డ్‌‌ కప్‌‌ సూపర్‌‌ 12 రౌండ్​లో ఇండియా సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసింది. ఐదింటిలో నాలుగు మ్యాచ్‌‌లు గెలిచి గ్రూప్‌‌ 2 టాపర్‌‌గా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ ఖతర్నాక్‌‌ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. మన ‘మిస్టర్‌‌ 360’ సూర్యకుమార్‌‌ అయితే  ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మూడు మ్యాచ్‌‌ల్లో తడబడ్డ ఓపెనర్ కేఎల్‌‌ రాహుల్‌‌ కూడా వరుసగా రెండు హాఫ్‌‌ సెంచరీలతో గాడిలో పడ్డాడు. స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా లేకున్నా.. భువనేశ్వర్‌‌, షమీ, అర్ష్‌‌దీప్‌‌ తమ పేస్‌‌తో  అవతలి బ్యాటర్లను వణికిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఫలితాలను బట్టి చూస్తే అంతా బాగానే కనిపిస్తోంది. కానీ, ఈ టోర్నీలో ఇండియా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. అందులో ముఖ్యమైనది కెప్టెన్‌‌, ఓపెనర్‌‌ రోహిత్‌‌ శర్మ ఫామ్. నెదర్లాండ్స్‌‌తో మ్యాచ్‌‌లో ఫిఫ్టీ (53) తప్పితే మిగతా నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో తను 4, 15, 2, 15 స్కోర్లతో నిరాశ పరిచాడు.  అతని ఫెయిల్యూర్‌‌ కారణంగా ఒక్క మ్యాచ్‌‌లోనూ ఇండియాకు సరైన ఆరంభం దక్కడం లేదు. మంచి పునాది పడాల్సిన పవర్‌‌ ప్లేల్లో మన జట్టు ఐదు ఇన్నింగ్స్‌‌ల్లో 31/3, 32/1, 33/2, 37/1, 46/1 స్కోర్లు మాత్రమే చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్‌‌ బెస్ట్‌‌ ఓపెనింగ్‌‌ జోడీల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న  రోహిత్‌‌–రాహుల్‌‌ మంచి ఆరంభం ఇవ్వకపోవడంతో మిడిల్‌‌, లోయర్‌‌ ఆర్డర్‌‌పై ఒత్తిడి పడుతోంది.  టోర్నీలో ఈ ఇద్దరి బెస్ట్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ 27 మాత్రమే (జింబాబ్వేపై). నెదర్లాండ్స్‌‌పై తప్పితే మిగతా నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ రోహిత్‌‌ పవర్‌‌ ప్లేలోనే వికెట్‌‌ పారేసుకున్నాడు. ఓవరాల్‌‌గా పవర్‌‌ ప్లేలో అతను 5 ఇన్నింగ్స్‌‌ల్లో 89.65 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 52 రన్స్‌‌ మాత్రమే చేసి నాలుగు సార్లు ఔటవడం శోచనీయం.  మూడు మ్యాచ్‌‌ల తర్వాత వరుసగా రెండు ఫిఫ్టీలతో కేఎల్‌‌ రాహుల్‌‌ గాడిలో పడినప్పటికీ.. కెప్టెన్‌‌ రోహిత్‌‌ ఇంకా ఫామ్‌‌ అందుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పవర్​ లేని పవర్​ ప్లే

రెగ్యులర్‌‌గా ఫస్ట్‌‌ బాల్‌‌ నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేయడం రోహిత్‌‌ స్టయిల్‌‌. పేసర్ల బౌలింగ్‌‌లో కొత్త బాల్‌‌ను అలవోకగా స్టాండ్స్‌‌లోకి పంపే రోహిత్‌‌.. కేఎల్‌‌ రాహుల్‌‌, విరాట్‌‌ కోహ్లీపై ఒత్తిడి తగ్గిస్తుంటాడు. ఈ ఫార్మాట్‌‌లో మిగతా బ్యాటర్లూ ఇలానే ఆడాలని కెప్టెన్‌‌తో పాటు టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కోరుకుంటోంది. కానీ, ఈ టోర్నీలో రోహిత్‌‌ మాత్రం తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవడంతో  పవర్‌‌ ప్లేలో  ఇండియా పవర్‌‌ ఫుల్‌‌గా ఆడలేకపోతోంది. మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ ముందు నుంచి బాగా ఆడటం, రాహుల్‌‌ గాడిలో పడటంతో పాటు మరీ ముఖ్యంగా సూర్యకుమార్‌‌ దూకుడుతో రోహిత్‌‌ ఫెయిల్యూర్‌‌ ఇప్పటిదాకా టీమ్‌‌ను పెద్దగా ప్రభావితం చేయలేదు. అయితే, ఈ ముగ్గురిలో ఇద్దరు బాగా ఆడితేనే జట్టు మంచి స్కోర్లు చేస్తోంది. నాకౌట్​లో వీళ్లు ఫెయిలైతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అందరినీ టెన్షన్ పెడుతోంది​  పైగా, సూర్యకుమార్‌‌పై జట్టు అతిగా ఆధారపడుతోందని అభిప్రాయాలు ఉన్నాయి. సూర్య బాగా ఆడకపోతే ఇండియా కనీసం 140-–150 స్కోరు కూడా చేయలేదని మాజీ కెప్టెన్‌‌ గావస్కర్‌‌ అంటున్నాడు. ఇది సూర్యకు ప్రశంసలా కాకుండా తనకు హెచ్చరికలా కెప్టెన్‌‌ రోహిత్‌‌ భావించాలి. కనీసం నాకౌట్​ దశలో అయినా తను గాడిలో పడాల్సిన అవసరం ఉంది.  ఇప్పటిదాకా గ్రూప్ దశ కాబట్టి ఓ మ్యాచ్‌‌లో తడబడినా తర్వాత పుంజుకునే అవకాశం లభించింది. కానీ, ఇప్పుడు నాకౌట్‌‌లో ఏ చిన్న తప్పిదం చేసినా మరో చాన్స్‌‌ ఉండదు. పైగా, సెమీస్‌‌లో ఇండియా ఎదుర్కోబోయే ఇంగ్లండ్‌‌ను పడగొట్టడం అంత ఈజీ కాబోదు.  కాబట్టి రోహిత్​ తక్షణమే బ్యాట్​ ఝుళిపించాలి. తన ఆటలో లోపం గుర్తిస్తే మంచిది. అవసరం అయితే కేఎల్‌‌ రాహుల్‌‌ మాదిరిగా.. మెంటల్‌‌ కండీషనింగ్‌‌ కోచ్‌‌ ప్యాడీ ఆప్టన్‌‌ సేవలు వినియోగించుకొని అయినా రోహిత్‌‌ గాడిలో పడాలి. పవర్‌‌ ప్లేలో తన పవర్‌‌ చూపెట్టాలి.