
గాయం కారణంగా గత సీజన్‌కు పూర్తిగా దూరం. ఈ సీజన్ ప్రారంభానికి ముందు అవమానకర రీతిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పోయింది. మధ్యలో టీ20 వరల్డ్ కప్ టీమ్‌కు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇంకోవైపు వెన్నుగాయం తిరగబెట్టే ప్రమాదం కనిపిస్తోంది. తన ఆట, వ్యవహార శైలిపై కొన్ని వర్గాల నుంచి విమర్శల దాడి.! ఇలాంటి పరిస్థితుల నడుమ ఐపీఎల్ 17లో అడుగు పెట్టిన శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ నైడర్స్‌ను అద్భుతంగా నడిపించాడు.
ఎదురు దెబ్బలను ఓర్చుకొని.. సవాళ్లను దాటుకొని.. ఒత్తిడిని జయించి తన జట్టును విజేతగా నిలిపాడు. మూడో టైటిల్ కోసం కేకేఆర్ పదేండ్ల ఎదురుచూపులకు తెరదించిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో తమ కెప్టెన్సీని నిరూపించుకొని టీమిండియా పగ్గాలు అందుకునే స్థాయికి ఎదిగారు.
ఇప్పుడు కేకేఆర్‌కు టైటిల్ అందించి శ్రేయస్ అయ్యర్ రూపంలో నేషనల్ టీమ్ పగ్గాలు అందుకునే సత్తా ఉన్న మరో లీడర్ వెలుగులోకి వచ్చాడు. గత రెండు సీజన్లలో ఏడో స్థానంలో నిలిచి నిరాశ పరిచిన కేకేఆర్ టైటిల్ నెగ్గడంతో మెంటార్ గౌతమ్ గంభీర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ, గౌతీతో పాటు టీమ్ సక్సెస్‌లో శ్రేయస్
అయ్యర్‌దీ సమాన పాత్ర. కెప్టెన్సీ విషయంలో ధోనీ మాదిరి ఫాలోయింగ్ లేకపోయినా.. బ్యాటర్‌గా విరాట్ కోహ్లీలా పరుగుల మోత మోగించకపోయినా.. ఓ లీడర్‌గా అతను తన టీమ్‌మేట్స్ నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్ రాబట్టాడు. మెంటార్ గంభీర్, కోచ్ చంద్రకాంత్ పండిత్‌తో వ్యూహాలు రచించి గ్రౌండ్‌లో వాటిని విజయవంతంగా అమలు చేశాడు. గ్రౌండ్‌లో కూల్‌గా ఉన్న అయ్యర్.. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్ మెంట్స్‌లో తన మార్కు చూపెట్టాడు.
తన బాధ్యతను పక్కాగా నిర్వహిస్తూ.. తోటి ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణం కలిపించాడు. చెన్నైలో ఫైనల్ ఆడటం ద్వారా ఐపీఎల్‌లో రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా ఫైనల్ ఆడిన క్రికెటర్‌గా శ్రేయర్ అరుదైన ఘనత సాధించాడు. 2020లో శ్రేయస్ కెప్టెన్సీలోని ఢిల్లీ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయింది.
ఇబ్బందులను అధిగమించి..
వాస్తవానికి ఈ ఐపీఎల్‌కు ముందు శ్రేయస్‌కు ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా గడ్డు పరిస్థితులు ఎదురైనా.. తనపై, జట్టుపై వాటి ప్రభావం లేకుండా చూసుకున్నాడు. గాయానికి సర్జరీ చేయించుకున్న శ్రేయస్ గతేడాది ఆసియా కప్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఇండియా టాప్ స్కోరర్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో నిరాశపరిచాడు.
తొలి రెండు టెస్టుల్లో 140 రన్స్ మాత్రమే చేసిన అతను చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. అదే టైమ్‌లో బీసీసీఐ మెడికల్ స్టాఫ్ నుంచి క్లియరెన్స్ వచ్చినప్పటికీ అతని వెన్నునొప్పి తిరగబెట్టింది. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో ముంబై టీమ్‌కు ఆడకుండా కేకేఆర్ ప్రీ సీజన్ క్యాంప్‌లో చేరడం దుమారానికి దారి తీసింది. తీవ్ర వివాదం తర్వాత రంజీ సెమీస్, ఫైనల్లో ఆడిన శ్రేయస్ ముంబై 42వ రంజీ ట్రోఫీ నెగ్గడంలో సాయం చేశాడు. కానీ, బీసీసీఐ అతడిని కాంట్రాక్ట్ (బి) నుంచి తప్పించింది.
టీమిండియా ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వొద్దని బీసీసీఐ సెక్రటరీ జై షా క్రికెటర్లందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఈ ఎపిసోడ్ అయ్యర్‌ను చాలా బాధ పెట్టింది. దాంతో ఈ ఐపీఎల్ ఆరంభంలో తను తడబడ్డాడు. సన్ రైజర్స్‌తో తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. కానీ, తన లక్ష్యం ఏంటో గుర్తెరిగిన శ్రేయస్ వెంటనే గాడిలో పడ్డాడు.
లీడర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రాణించాడు. అయితే ఓపెనర్లు నరైన్, సాల్ట్ తుఫాన్ ఇన్నింగ్స్‌ల కారణంగా అయ్యర్ పోరాటాలకు సరైన గుర్తింపు రాకుండా పోయింది. ఈ సీజన్‌లో 2 ఫిఫ్టీలు సహా 351 రన్స్ చేసిన అతను కేకేఆర్ తరఫున నాలుగో టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. సన్ రైజర్స్‌తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 160 రన్స్ ఛేజింగ్‌లో తన బెస్ట్ ఇన్నింగ్స్ (58 నాటౌట్) ఆడి టీమ్‌ను ఫైనల్ చేర్చాడు. ఏదేమైనా అనేక ప్రతికూల పరిస్థితుల తర్వాత లీగ్‌లో అత్యంత పోటీని, ఒత్తిడిని అధిగమిస్తూ.. కేకేఆర్‌ను నడిపించిన విధానం సూపర్. తన నాయకత్వ లక్షణాలను అయ్యర్ మరింత మెరుగు పరుచుకున్నాడు. ఇది కేకేఆర్‌తో పాటు టీమిండియాకు కూడా శుభసూచకం.