భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని సీతారాంపురం ముర్రేడు వాగు బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తోన్న ఆటోని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా.. ఆటో డ్రైవర్‌తో సహా మరో ఆరుగురు స్టూడెంట్స్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
ఆటో డ్రైవర్‌తో పాటు గాయపడిన విద్యార్థులను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విద్యార్థులను ములకలపల్లి మండలంలోని పూసగూడెం, సుబ్బనపల్లి, వీకే రామవరం గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పాల్వంచ పట్టణ పరిధిలోని డీఏవీ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఈశ్వర అనే విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.