ఆన్‌‌లైన్‌‌లోనే కారుకు లోన్‌‌ శాంక్షన్

ఆన్‌‌లైన్‌‌లోనే కారుకు లోన్‌‌ శాంక్షన్

మారుతీ సుజుకి ‘స్మార్ట్ ఫైనాన్స్’

నెక్సా ద్వారా 30 సిటీల్లో ఆఫర్

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కారు తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా ఆన్‌‌లైన్ కారు ఫైనాన్షింగ్ ప్లాట్‌‌ఫామ్ ‘స్మార్ట్ ఫైనాన్స్’ను లాంచ్  చేసింది. ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ను కంపెనీ తొలుత ప్రీమియం కారు రిటైల్ చెయిన్ నెక్సా ద్వారా 30 సిటీల్లో తీసుకొచ్చింది. శాలరీడ్ కస్టమర్లను టార్గెట్‌‌గా చేసుకుని దీన్ని తెచ్చింది. ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ను తన మరో రిటైల్ చెయిన్ ఎరెనాకు కూడా విస్తరించాలని కంపెనీ అనుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ కల్లా కస్టమర్ బేస్‌‌ను పెంచుకోవాలని మారుతీ భావిస్తోంది. ‘స్మార్ట్ ఫైనాన్స్’ ద్వారా పొటెన్షియల్ కస్టమర్లకు కారు ఫైనాన్స్‌‌కు సంబంధించిన అన్ని వివరాలను అందిస్తుంది. పలు ఫైనాన్స్ ఆప్షన్లతో సమగ్రమైన ఫైనాన్స్ సొల్యూషన్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌గా ఇది ఆఫర్ చేస్తుందని మారుతీ సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది.

నెక్సా వెబ్‌‌సైట్‌‌పై ఉన్న స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌‌ఫామ్ కోసం తాము పాపులర్ ఫైనాన్సియర్లతో భాగస్వామ్యమైనట్టు మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవ అన్నారు. ఈజీ ఫైనాన్షింగ్ ఆప్షన్లను ఈ డిజిటల్ సర్వీస్ ఆఫర్ చేస్తుందన్నారు. లోన్ ప్రాసెస్‌‌లో ప్రతి దశ పూర్తి పారదర్శకంగా ఉంటుందని హామీ ఇచ్చారు. లోన్ టెన్యూర్‌‌, వడ్డీ, ప్రిఫర్డ్ డౌన్‌‌పేమెంట్ స్కీమ్ ఎంపికను బట్టి కస్టమైజ్డ్ ఈఎంఐ ఉంటుందని తెలిపారు. స్మార్ట్ ఫైనాన్స్ కోసం మారుతీ సుజుకి ఇండియా ఎనిమిది మంది ఫైనాన్షియర్లతో అంటే హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, చోలమండలమ్ ఫైనాన్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్, కొటక్ మహీంద్రా ప్రైమ్‌‌లతో జత కట్టింది.

ఆగస్ట్ నుంచే ప్రారంభించాం…

ఈ ప్లాట్‌‌ఫామ్ పైలట్‌‌ను నెక్సా ఛానల్‌‌తో కలిసి ఈ ఏడాది ఆగస్ట్ నుంచే ప్రారంభించామని,  మొత్తం సేల్స్​లో 18 శాతం ఈ ప్లాట్‌‌ఫామ్‌‌వే ఉంటున్నట్టు ఎంఎస్‌‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్ ఫైనాన్స్ శాలరీడ్ కస్టమర్లకే అందుబాటులో ఉంటుంది. దీన్ని ఇతర కస్టమర్లకు కూడా త్వరలోనే విస్తరించనుంది. అలాగే ఈ సర్వీసులను ఎరెనా రిటైల్ చెయిన్‌‌కు కూడా విస్తరించనున్నట్టు శ్రీవాస్తవ చెప్పారు. కరోనా వైరస్‌‌తో చాలా మంది కస్టమర్లు కొనుగోళ్ల కోసం ఆన్‌‌లైన్‌‌గా రీసెర్చ్ చేయడమే కాకుండా.. ఫైనాన్షింగ్ ఆప్షన్ల కోసం కూడా ఆన్‌‌లైన్‌‌ వైపుకే చూస్తున్నారని శ్రీవాస్తవ అన్నారు. పలువురు ఫైనాన్షియర్లతో కలిసి విభిన్నమైన లోన్ ఆఫర్లను అందిస్తున్నామని ఎంఎస్‌‌ఐ చెప్పింది.