
- ఏడాది లెక్కన 2.84 శాతం వృద్ధి
- జీఎస్‌టీ తగ్గిస్తారనే అంచనాలతో కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వినియోగదారులు
- సెప్టెంబర్‌లో సేల్స్ పెరిగే ఛాన్స్
- పండుగ సీజన్, జీఎస్‌టీ కోతతో ఆటో రంగానికి ఊపు: ఫాడా
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా వాహన రిటైల్ అమ్మకాలు 2.84శాతం పెరిగి 19,64,547 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 19,10,312 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) తెలిపింది.
వివిధ సెగ్మెంట్లలో అమ్మకాలు ఇలా..
- కార్లు, బస్సులు వంటి ప్యాసింజర్ వాహనాలు (పీవీ): పీవీ అమ్మకాలు ఆగస్టులో 0.93శాతం పెరిగి 3,23,256 యూనిట్లకు చేరాయి. నెల ప్రారంభంలో ఎంక్వైరీలు, పండుగ బుకింగ్స్ బాగా ఉన్నా, జీఎస్‌టీ తగ్గింపు వార్తలతో నెల చివర్లో కొనుగోళ్లు తగ్గాయి.
- టూ వీలర్లు: 13,73,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది లెక్కన 2.18 శాతం వృద్ధి నమోదైంది. ఓనమ్, వినాయక చవితి వంటి పండుగల వల్ల ఎంక్వైరీలు బలంగా ఉన్నా, వర్షాలు, వరదలు, స్కూటర్ మోడళ్ల సరఫరా లోపం వంటివి సేల్స్‌పై ప్రభావం చూపాయి.
- కమర్షియల్ వాహనాలు: 8.55శాతం వృద్ధితో 75,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది అన్ని సెగ్మెంట్లలో అత్యధిక వృద్ధి.
- త్రీ-వీలర్లు: 1,03,105 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 2.26శాతం తగ్గాయి.
“జీఎస్‌టీ 2.0 వల్ల సెప్టెంబర్‌లో కొనుగోళ్లు బలంగా పుంజుకుంటాయి. ‘సింపుల్ ట్యాక్స్’ దిశగా ప్రజల కోసం కేంద్రం తెచ్చిన సంస్కరణ ఇది” అని ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ అన్నారు. ఈ నెల 7 నుంచి 21 వరకు శ్రాద్ధం (మరణించిన తాత ముత్తాతలకు పిండ ప్రదానం చేసే సమయం) ఉంటుంది. ఈ టైమ్‌లో కొత్త బండ్లు కొనడం, శుభకార్యాలు వంటివి హిందువులు పెద్దగా జరపరు.
దీంతో సెప్టెంబర్ మొదటి 15 రోజుల్లో బండ్ల అమ్మకాలు ఎక్కువగా జరగవని, కానీ జీఎస్‌టీ తగ్గింపు వలన రెండో అర్థ భాగంలో సేల్స్ ఊపందుకుంటాయని ఫాడా అంచనా వేస్తోంది. వినియోగదారులు ఇప్పుడు బుకింగ్ చేసుకుని, నవరాత్రి, దుర్గాపూజ వంటి శుభదినాల్లో డెలివరీ పొందే అవకాశం ఉందని తెలిపింది. జీఎస్‌టీ 2.0, కంపెనీల ఆఫర్లు, పండుగల సీజన్ వంటివి ఆటో సెక్టార్‌ను బలంగా ముందుకు నడిపించనున్నాయని అభిప్రాయపడింది.
మరిన్ని కార్ల ధరలు డౌన్
ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్‌టీ రేటును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ బండ్ల రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్, టయోట, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్ వంటి కంపెనీలు ధరలు తగ్గిస్తామని ప్రకటించగా, తాజాగా ఆడి, కియా, లెక్సస్, టీవీఎస్ మోటార్, నిస్సాన్ కూడా ధరలు తగ్గిస్తామని పేర్కొన్నాయి.
ఆడి ఇండియా రూ.2.6 లక్షల నుంచి రూ.7.8 లక్షల వరకు రేట్లు తగ్గించింది. క్యూ3 ఎస్‌యూవీ ధర రూ.46.14 లక్షల నుంచి రూ.43.07 లక్షలకు, క్యూ8 రూ.1.18 కోట్ల నుంచి రూ.1.1 కోట్లకు దిగొచ్చింది.
లెక్సస్ ఇండియా కూడా రూ.1.47 లక్షల నుంచి రూ.20.8 లక్షల వరకు ధరలు తగ్గించింది. ఈఎస్ 300 హెచ్, ఎల్‌ఎక్స్ 500డీ వంటి మోడళ్లపై ఈ తగ్గింపులు వర్తిస్తాయి. కంపెనీ ఈ జీఎస్‌టీ తగ్గింపును “చారిత్రాత్మక సంస్కరణ”గా పేర్కొంది.
నిస్సాన్ ఇండియా తమ మాగ్నైట్ ఎస్‌యూవీ ధరను రూ. లక్ష వరకు తగ్గిస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి డెలివరీలపై కొత్త ధరలు వర్తిస్తాయి.
కియా ఇండియా కేరెన్స్‌పై రూ.48,513, కార్నివల్‌పై రూ.4.48 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కూడా రూ.54,000 నుంచి రూ.3.04 లక్షల వరకు ధరలు తగ్గించింది.
టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అన్ని ఐసీఈ వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపును పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తామని ప్రకటించింది. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తుంది. ఈవీలపై 5శాతం కన్సెషనల్ జీఎస్‌టీ కొనసాగుతుంది.