బండ్లు.. స్లో : రోజు రోజుకి తగ్గుతున్న సేల్స్

బండ్లు.. స్లో : రోజు రోజుకి తగ్గుతున్న సేల్స్

ఏం చేసినా ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చినా ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ కష్టాలు తగ్గడం లేదు. యథావిధిగా వరుసగా 20వ నెలలోనూ వెహికిల్ సేల్స్‌ తగ్గిపోయాయి. ఇక నుంచి కూడా ఈ పరిశ్రమకు గడ్డు రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలోనూ అమ్మకాలు 30 శాతం తగ్గాయని కంపెనీల డేటా వెల్లడించింది. ప్యాసింజర్‌, కమర్షియల్‌, అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. కొత్త మోడల్స్‌ రావడం, ఆకర్షణీయమైన ఆఫర్ల వల్ల టూవీలర్లు, ఎస్‌ యూవీల అమ్మకాలు కాస్త బాగున్నాయి. ఇండియావ్యాప్తంగా వరదలు రావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిం చడం వల్ల అమ్మకాలు మరింత తగ్గుతాయన్న నిపుణుల అంచనాలు నిజమయ్యాయి. అయితే పండగ సీజన్‌ సమీపిస్తున్నప్పటికీ వాహనాలకు డిమాండ్‌ పెరగకపోవడం గమనార్హం.

ఆటో సెక్టార్‌ కోలుకోవడానికి ప్రభుత్వం ఇటీవలే చర్యలు ప్రకటించి నందున, డిమాండ్‌ పెరగడానికి కాస్త సమయం పడుతుందని గ్రాంట్‌ థార్న్‌‌‌‌టన్‌ కు చెందిన వి.శ్రీధర్‌ అన్నారు. ఈ ఏడాది జూలై కంటే ఆగస్టు అమ్మకాలు ఇంకా తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తగ్గుదలకు కారణాలివి…

ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో వరదలు రావడం వల్ల చాలా మంది వాహనాల కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. జీఎస్టీ రేట్లు ఎక్కువగా ఉండటం, వ్యవసాయరంగం ఇబ్బందుల్లో పడటం, జీతాలు పెరక్కపోవడం, లిక్విడిటీ లేకపోవడం వల్ల డిమాండ్‌ పెరగలేదు. బీఎస్‌ –4 కాలుష్య ప్రమాణాల వాహనాలు అమ్ముడవకపోవడంతో డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. దీంతో కంపెనీలు ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేయగా, లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. పండుగలు దగ్గరపడుతున్నాయి కాబట్టి పరిస్థితుల్లో మార్పు రావొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ సీనియర్‌ ఆఫీసర్‌ స్నేహదీప్‌ బోహ్రా అభిప్రాయపడ్డారు.

ఇవీ లెక్కలు

మనదేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ అమ్మకాలు ఆగస్టులో 32.7 శాతం తగ్గి 1,06,413 యూనిట్లు గా నమోదయ్యాయి. 2018 ఆగస్టులో ఇది 1,58,189 లక్షల యూనిట్లను అమ్మింది. జూలై అమ్మకాలు 97 వేల యూనిట్లుగా నమోదయ్యాయి.