వాషింగ్టన్: అమెరికాలోని కెంటకీలో ఘోర ప్రమాదం జరిగింది. యునైటెడ్ పార్సిల్ సర్వీస్ (యూపీఎస్)కు చెందిన కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9మంది చనిపోయారు. లూయిస్ విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు యూపీఎస్ విమానం హోనోలులుకు బయల్దేరిన కాసేపటికే ప్రమాదానికి గురైంది.
ఒక్కసారిగా మంటలు ఎగసిపడి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించగా.. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు ధ్రువీకరించారు. వాణిజ్య సముదాయాలపై విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విమానంలో పెద్ద మొత్తంలో ఇంధనం ఉండటం వల్లే మంటలు చెలరేగాయని లూయిస్ విల్లే మేయర్ గ్రీన్ బర్గ్ పేర్కొన్నారు.
