US Open 2025: యుఎస్ ఓపెన్ ఛాంపియన్ అల్కరాజ్.. ఫైనల్లో సిన్నర్‌పై గెలుపు.. టైటిల్‌తో పాటు నెంబర్ ర్యాంక్

US Open 2025: యుఎస్ ఓపెన్ ఛాంపియన్ అల్కరాజ్.. ఫైనల్లో సిన్నర్‌పై గెలుపు.. టైటిల్‌తో పాటు నెంబర్ ర్యాంక్

యూఎస్ ఓపెన్ 2025 మెన్స్ ఛాంపియన్స్ టైటిల్ ను స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 8) రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్లో జనిక్ సిన్నర్ పై గెలిచాడు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమరంలో సిన్నర్ పై 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో అద్భుత విజయం సాధించాడు. అల్కరాజ్ కెరీర్ లో ఇది ఆరో గ్రాండ్ స్లామ్ కాగా.. ఈ ఏడాది రెండోది. 2025లో సిన్నర్ పైనే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. విజేతగా నిలిచిన ఈ స్పెయిన్ స్టార్ కు టైటిల్ తో నెంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. అల్కరాజ్ కు  ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. 2022 లో తొలిసారి యూఎస్ ఓపెన్ గెలుచుకున్నాడు.   

సిన్నర్, అల్కరాజ్ మధ్య బ్లాక్ బస్టర్ పోరు ఖాయమనుకుంటే మ్యాచ్ మాత్రం చప్పగా సాగింది. తొలి సెట్ తొలి గేమ్ నుంచే  అల్కరాజ్ తన ఆధిపత్యాన్ని చూపించాడు. తొలి గేమ్ లోనే సిన్నర్ సర్వీస్ బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత మరోసారి సర్వీస్ బ్రేక్ చేసి 6-2 తేడాతో తొలి సెట్ గెలుచుకున్నాడు. తొలి సెట్ ఓడిపోయిన సిన్నర్ రెండో సెట్ లో అద్భుతంగా పుంజుకున్నాడు. అల్కరాజ్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 6-3 తేడాతో రెండో సెట్ గెలుచుకున్నాడు. మూడో సెట్ లో అల్కరాజ్ విశ్వ రూపమే చూపించాడు. రెండు సార్లు సిన్నర్ సర్వీస్ బ్రేక్ చేసి 6-1 తేడాతో సెట్ గెలుచుకున్నాడు. 

నాలుగో సెట్ లో ఐదో గేమ్ లో సిన్నర్ సర్వీస్ బ్రేక్ చేసిన అల్కరాజ్ ఆధిక్యంలోకి వెళ్ళాడు. ఇదే ఊపులో సెట్ తో పాటు మ్యాచ్.. టైటిల్ ను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో అల్కరాజ్ కేవలం ఒక్కసారి మాత్రమే తన సర్వీస్ కు కోల్పోగా సిన్నర్ సర్వీస్ ను ఏకంగా ఐదు సార్లు బ్రేక్ చేయడం విశేషం. మరోవైపు ఫైనల్ కు చేరుకునే క్రమంలో తిరుగులేని ఆట తీరుతో దూసుకెళ్లిన సిన్నర్.. తుది సమరంలో అల్కరాజ్ ధాటికి కుదేలయ్యాడు. 22 ఏళ్ళ కార్లోస్ అతి తక్కువ వయసులో ఆరు గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్న ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.