Italian Open: మట్టిపై మరో స్పెయిన్ యోధుడు.. రోమ్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్

Italian Open: మట్టిపై మరో స్పెయిన్ యోధుడు.. రోమ్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్

క్లే కోర్ట్ అంటే రఫెల్ నాదల్. స్పెయిన్ కు చెందిన నాదల్ రెండు దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని చూపించాడు. ఏకంగా 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. నాదల్ టెన్నిస్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో మరో స్పెయిన్ వీరుడు మట్టి కోర్ట్ లో తన తడాఖా చూపిస్తున్నాడు. నాదల్ తర్వాత తనదే క్లే అన్నట్టు చెలరేగిపోతున్నారు. అతనెవరో కాదు ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఈ స్పెయిన్ వీరుడు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందు జరిగిన రోమ్ మాస్టర్స్ 1000 టైటిల్ గెలుచుకున్నాడు.          

ALSO READ | బోర్డియక్స్ టోర్నీ రన్నరప్‌‎గా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాంబ్రీ జోడీ

ఆదివారం (మే 18) సిన్నర్ తో జరిగిన రోమ్ మాస్టర్స్ ఫైనల్లో సిన్నర్ ను అల్కరాజ్ వరుస సెట్లలో ఓడించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో అల్కరాజ్ 7-6 (7/5), 6-1 తేడాతో ప్రపంచ నంబర్ వన్ సిన్నర్‌పై గెలిచాడు. మరోవైపు 1976లో అడ్రియానో ​​పనట్టా తర్వాత ఇటాలియన్ టోర్నమెంట్‌ గెలుచుకొని చరిత్ర సృష్టిద్దామనుకున్న సిన్నర్ కు ఫైనల్లో నిరాశే ఎదురైంది. అంతేకాదు సిన్నర్ వరుసగా 26 విజయాలకు అల్కరాజ్ బ్రేక్ వేశాడు. ఈ విజయంతో అల్కరాజ్ ఏటీపీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. 

తొలి సెట్ లోనే పోటీ:

టాప్ సీడ్స్ మధ్య మ్యాచ్ జరగడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్టుగానే ఇద్దరూ తొలి సెట్ లో నువ్వా నేనీ అన్నట్టుగా ఆడారు. 12 గేమ్ లో సిన్నర్ కు రెండు సెట్ పాయింట్స్ అవకాశం వచ్చినా అల్కరాజ్ అద్భుతంగా ఆడి గేమ్ నిలబెట్టుకొని టై బ్రేకర్ కు తీసుకెళ్లాడు. టై బ్రేక్ లో కూడా 5-5 తో సమంగా నిలిచారు. అయితే కీలక దశలో అల్కరాజ్ సిన్నర్ పై ఆధిపత్యం చూపించి తొలి సెట్ ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్ లో అల్కరాజ్ ధాటికి సిన్నర్ పూర్తిగా చేతులెత్తేశాడు. 6-1 తేడాతో సిన్నర్ ను చిత్తుగా ఓడించి రెండో సెట్ తో పాటు మ్యాచ్ గెలిచాడు.