యాదగిరిగుట్టలో కార్డన్ సెర్చ్..29 బైకులు, 6 ఆటోలు, కారు సీజ్, రూ.18 వేల మద్యం స్వాధీనం

యాదగిరిగుట్టలో కార్డన్ సెర్చ్..29 బైకులు, 6 ఆటోలు, కారు సీజ్, రూ.18 వేల మద్యం స్వాధీనం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని ప్రశాంత్ నగర్, గణేశ్ నగర్‌‌‌‌లో బుధవారం సాయంత్రం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు ప్రశాంత్ నగర్, గణేశ్ నగర్ లో ప్రతి ఇల్లు, లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 బైకులు, 6 ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. అదేవిధంగా పలు బెల్టు షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న దాదాపుగా రూ.18 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

అనంతరం యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 'సేఫ్ యాదగిరిగుట్ట' లక్ష్యంతో ఇకపై యాదగిరిగుట్ట పట్టణంలో క్రమం తప్పకుండా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట టౌన్ సీఐ భాస్కర్, రూరల్ సీఐ శంకర్ గౌడ్, పది మంది ఎస్ఐలు, నలుగురు ఆర్ఎస్ఐలు, ఇద్దరు ఏఆర్ ఎస్ఐలు, 47 మంది కానిస్టేబుళ్లు, 48 ఏఆర్ ఫోర్స్ పాల్గొన్నారు.