
మన విశ్వంలో తొమ్మిది గ్రహాలున్నాయి. వాటినే మనం నవగ్రహాలు అని పిలుచుకుంటాం. ఒక్కో గ్రహం ఒక్కో దానికి సంకేతంగా చూస్తాం. ఇప్పుడు ఈ గ్రహాల లొల్లి కాసేపు పక్కన పెడదాం. ఉపగ్రహాల గురించి మాట్లాడుకందాం. విశ్వంలో ఉన్న ఏకైక సహజసిద్ధమైన ఉపగ్రహం చంద్రుడు. కానీ, రకరకాల అవసరాల కోసం మనం నింగిలోకి ఎన్నెన్నో ఉపగ్రహాలను పంపుతున్నాం. అందులో ఒకటే నిఘా ఉపగ్రహం. అదేనండి, ఇస్రో బుధవారం నింగిలోకి సక్సెస్‌ఫుల్‌గా పంపిన కార్టోశాట్3 ఉపగ్రహం. నిఘా సిరీస్‌లో పంపిన తొమ్మిదో ఉపగ్రహమిది. అందుకే ఆ నవగ్రహాల ఊసు. ఇప్పటికే ఆకాశంలో నిఘా వేస్తున్న 8 ఉపగ్రహాలకు ఇది తోడుగా ఉండబోతోంది. బుధవారం ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 రాకెట్‌తో కార్టోశాట్3 ఉపగ్రహాన్ని అనుకున్న కక్ష్యలోకి చేర్చింది. చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ వైఫల్యం తర్వాత చేసిన ప్రయోగం కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది.
17 నిమిషాల 46 సెకన్లకు
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్సెంటర్లోని రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న ఇస్రో గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ సీ47, అనుకున్న టైం ప్రకారం ఉదయం 9.28 గంటలకు నింగికెగిసింది. సరిగ్గా 17 నిమిషాల 46 సెకన్లకు టార్గెట్‌ను చేరి కార్టోశాట్3ని 509 కిలోమీటర్ల ఎత్తులో సక్సెస్‌ఫుల్‌గా వదిలేసింది. 26 నిమిషాల 56 సెకన్లకు అమెరికాకు చెందిన 13 చిన్న ఉపగ్రహాలనూ కక్ష్యలోకి చేర్చింది. అమెరికా శాటిలైట్లలో 12 ఫ్లాక్4పీ, ఒక కమ్యూనికేషన్ టెస్ట్‌బెడ్ అయిన మెష్బెడ్లున్నాయి. ఇస్రో కమర్షియల్ వింగ్ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో ఒప్పందంలో భాగంగా ఈ శాటిలైట్లను నింగిలోకి పంపింది ఇస్రో.
నాలుగు నెలలు.. 13 మిషన్లు
మిషన్ సక్సెస్ అయిన తర్వాత ఇస్రో చీఫ్ కె.శివన్ మిషన్ కంట్రోల్ సెంటర్లో మాట్లాడారు. ఇస్రో ఇప్పటిదాకా నింగిలోకి పంపిన ఉపగ్రహాల్లో కార్టోశాట్3నే అత్యంత క్లిష్టమైనదని చెప్పారు. ‘‘పీఎస్ఎల్వీ సీ47 అత్యంత కచ్చితత్వంతో కార్టోశాట్3, మరో 13 శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చింది” అని ప్రకటించారు. ప్రస్తుతం ఇస్రో చేతిలో మరిన్ని ప్రయోగాలున్నాయన్నారు. 2020 మార్చి నాటికి 13 మిషన్లు చేపట్టాల్సి ఉందని, ప్రస్తుతం చేతులు ఖాళీగా లేవని అన్నారు. అందులో ఆరు లాంచ్ వెహికిల్ మిషన్లు, ఏడు శాటిలైట్ లాంచ్ మిషన్లున్నాయన్నారు.
ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు
శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అవడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు ఇస్రోకు, ప్రయోగంలో పాల్పంచుకున్న సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. అడ్వాన్స్డ్ కార్టోశాట్ 3 శాటిలైట్ మన హై రిజల్యూషన్ ఇమేజింగ్ సత్తాను మరింత పెంచుతుందని రాష్ట్రపతి కొనియాడారు. ఇస్రో టీం మొత్తానికి ఆయన అభినందనలు తెలిపారు. ‘‘ఇస్రో టీం మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశీయ ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన చిన్న ఉపగ్రహాలను పీఎస్ఎల్వీసీ47 ద్వారా నింగిలోకి సక్సెస్‌ఫుల్‌గా పంపడం ఆనందంగా ఉంది” అని మోడీ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇస్రో సైంటిస్టులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇస్రో సైంటిస్టుల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
కార్టోశాట్ ఉపగ్రహాలివీ.. ఎందుకు?
కార్టోశాట్1, కార్టోశాట్2, కార్టోశాట్2ఏ, కార్టోశాట్2బీ, కార్టోశాట్2సీ, కార్టోశాట్ 2డీ, కార్టోశాట్ 2ఈ, కార్టోశాట్2ఎఫ్, కార్టోశాట్3. రిమోట్ సెన్సింగ్, భూమిలోని సహజవనరులను తెలుసుకోవడం, వాటి నిర్వహణ కోసం తొలిసారి ఈ సిరీస్‌లో 2005 మే 5న కార్టోశాట్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. స్పేషియల్, భూమికి సంబంధించిన ఫొటోలు ఎక్కువ రిజల్యూషన్స్‌తో తీస్తుండడం వల్ల దానికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కార్టోశాట్‌లో మరిన్ని ఉపగ్రహాలను ఇస్రో పంపింది. 2007 జనవరి 10న కార్టోశాట్ 2, 2008 ఏప్రిల్28న కార్టోశాట్2ఏ (ఏరోస్పేస్ కమాండ్ల కోసం ప్రత్యేకించి వాయుసేన కోసం ఈ ఉపగ్రహాన్ని పంపారు), 2010 జులై 12న కార్టోశాట్2బీ, కొన్ని రోజుల పాటు ఆలస్యం జరిగిన తర్వాత 2016 జూన్22న కార్టోశాట్2సీ, 2017 ఫిబ్రవరి 15న కార్టోశాట్2డీ, అదే ఏడాది జూన్ 23న కార్టోశాట్2ఈ, 2018 జనవరి 12న కార్టోశాట్ 2ఎఫ్‌ను నింగిలోకి పంపించారు. కార్టోశాట్2ఎఫ్‌తో పాటు ఇండియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, బ్రిటన్, అమెరికాకు చెందిన మరో 30 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చారు. ఈ సిరీస్‌లో తాజాగా జరిగిన ప్రయోగమే కార్టోశాట్ 3. 25 సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో ఫొటోలు తీస్తుంది.
మిలటరీ అవసరాలతో పాటు అర్బన్ ప్లానింగ్, గ్రామీణ ప్రాంతాల వనరులు, తీర ప్రాంతాల భూముల వాడకం వంటి సేవలనూ అందిస్తుంది. కార్టోశాట్ 3 ఉపగ్రహం బరువు 1625 కిలోలు.